TELANGANA BJP: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కట్ చేస్తే కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ అంతా మారిపోయింది. కాంగ్రెస్‌లో జోష్ మొదలైంది. అదే సమయంలో బీజేపీ వీక్ అయింది. చేరికలన్నీ గాంధీభవన్ వైపు కనిపించాయే తప్ప.. కమలం పార్టీ వైపు పెద్దగా చూసింది లేదు ఎవరూ! ఐతే ఇంకొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయ్. దీంతో దూకుడు పెంచాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనాల్లో బీజేపీ బలం పెరిగేలా చేయాలని పార్టీ డిసైడ్ అయింది.
ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఐతే దసరా తర్వాత నుంచి మరింత దూకుడు చూపించాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. ముఖ్యంగా కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్‌కు పోటీగా ఈటల బరిలో దిగుతుండగా.. కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం కామారెడ్డి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. ఆయన చాలాకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పెరిగేలా ఇవన్నీ కలిసి వస్తాయని కమలం పార్టీ భావిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు, జాతీయస్థాయి నేతలు కూడా కామారెడ్డిలో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసి.. జనాలకు మరింత దగ్గరయ్యే విధంగా బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎలా అయినా సరే.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కామారెడ్డితో పాటు.. ఇతర నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. కేంద్రమంత్రులు, పార్టీ అగ్ర నేతలు ఈ బహిరంగసభల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.