Telangana BJP: బీజేపీ రెండో జాబితా సిద్ధం.. ఎవరెవరికి సీట్లు..?

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కని కొందరు నేతలు కూడా.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమకు టిక్కెట్లపై హామీ ఇస్తే.. వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు వీళ్లంతా సిద్ధంగా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 03:56 PM IST

Telangana BJP: తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఒక జాబితాను బీజేపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిక్కెట్ ఆశిస్తున్న నేతలు రెండో లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ తాజా జాబితాపై కసరత్తు చేస్తోంది. కొన్ని సీట్ల విషయంలో పోటీ ఎక్కువగా ఉంటే.. ఇంకొన్ని సీట్లలో ఎవరికి సీటు కేటాయిస్తే బాగుంటుందో అని కమిటీ ఆలోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీట్ల విషయంలో ఎక్కువ చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ నుంచి విక్రమ్ గౌడ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి గోపాల్ రెడ్డి లేదా బండారు విజయలక్ష్మి, అంబర్ పేట నుంచి బండారు విజయలక్ష్మి లేదా గౌతమ్ రావుకు టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధి టిక్కెట్ల కేటాయింపులో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. మల్కాజ్‌గిరి నుంచి ఆకుల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, వంగా మధుసూధన్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, మేడ్చల్ నుంచి విక్రమ్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటుగా వీరేందర్ గౌడ్ పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి, వివిధ నియోజకవర్గాల్లో వారికి పోటీ ఇచ్చే నేతల కోసం కూడా బీజేపీ ఆలోచిస్తోంది. అలాగే రెండు పార్టీల్లో టిక్కెట్లు దక్కని కొందరు నేతలు కూడా.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తమకు టిక్కెట్లపై హామీ ఇస్తే.. వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు వీళ్లంతా సిద్ధంగా ఉన్నారు. దీన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. వారి బలాబాలాలను పరిశీలించి వారి పేర్లను సీట్ల ఖరారు సమయంలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలని కూడా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్లే టిక్కెట్ల కేటాయింపు కాస్త ఆలస్యం అవుతోంది. అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పోలిస్తే.. బీజేపీ టిక్కెట్ల కేటాయింపులో ఇంకా వెనుకబడే ఉంది. ఓవైపు ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ 1 లేదా 2న బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పది సీట్లు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది.