BJP: బీజేపీ తొలి జాబితా రెడీ.. 40 మందితో ఫస్ట్ లిస్ట్..!

మొదటి జాబితాలో బీజేపీలోని సీనియర్ నేతలు, బలమైన నేతల పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఎలాంటి వివాదం లేని అభ్యర్థుల జాబితాను మొదట వెల్లడిస్తారు. ఆ తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 02:39 PM IST

BJP: ఎన్నికల రేసులో వెనుకబడిపోయినట్లు కనిపిస్తున్న బీజేపీ నెమ్మదిగా దూకుడు పెంచుతోంది. ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని బీజేపీ.. ఇప్పుడు తొలి జాబితా సిద్ధం చేస్తోంది. త్వరలోనే తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. 35-40 మందితో తొలి జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది. దీనిపై బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించనుంది. కేంద్ర కమిటీతో చర్చించిన తర్వాత ఈ జాబితాపై గ్రీన్ సిగ్నల్ రావొచ్చని తెలుస్తోంది.

మొదటి జాబితాలో బీజేపీలోని సీనియర్ నేతలు, బలమైన నేతల పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఎలాంటి వివాదం లేని అభ్యర్థుల జాబితాను మొదట వెల్లడిస్తారు. ఆ తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీలో జరిగే భేటీకి హాజరవుతారు. అనంతరం జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా మొదటి జాబితా విడుదల చేసింది. బీజేపీనే ఈ విషయంలో వెనుకబడి ఉంది. అందుకే త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తోంది. నిజానికి బీజేపీలో టిక్కెట్ల విషయంలో పెద్దగా పోటీ లేదు.

పార్టీకి ఉన్న సమస్య.. అంతర్గత పోరు. పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు నేతలు పార్టీ మారేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఆదరణ అంతంతమాత్రమే ఉంది. పార్టీ ప్రభావం పెద్దగా ఉంటుందనే అంచనాలు కూడా లేవు. అయితే, మోదీ, అమిత్ షా వంటి పార్టీ అగ్రనేతలతో ప్రచారం కొంత కలిసొస్తుందనే ఆశాభావంతో నేతలున్నారు.