TELANGANA BJP: బీజేపీలోకి వచ్చేదెవరు..? పోటీపై నేతలకు ఆసక్తి లేదా..?

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. వివేక్ వెంకట స్వామి, డీకే అరుణ వంటి మరికొందరు నేతలు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇలాంటి నేతలకు కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ హామీ లభిస్తే.. బీజేపీకి గుడ్‌బై చెప్పడం ఖాయం.

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 04:39 PM IST

TELANGANA BJP: తెలంగాణ బీజేపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితినే ఎదుర్కుంటోంది. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. వివేక్ వెంకట స్వామి, డీకే అరుణ వంటి మరికొందరు నేతలు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇలాంటి నేతలకు కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ హామీ లభిస్తే.. బీజేపీకి గుడ్‌బై చెప్పడం ఖాయం. ఎన్నికల సమయంలో నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేసి, వెళ్తుండటంతో బీజేపీలో సరైన నాయకులే కరువయ్యారు.

ఈ ఏడాదిలోనే దాసోజు శ్రవణ్‌కుమార్‌, మోత్కుపల్లి నర్సింహులు, స్వామిగౌడ్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, ఎర్రశేఖర్‌, నాగం జనార్ధన్‌రెడ్డి, పుష్పలీల వంటి నేతలు బీజేపీ నుంచి వెళ్లిపోయారు. పార్టీలో ఉన్న వారిలో కూడా చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. అధిష్టానం సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లోనే కొందరు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీకే అరుణ, వివేక్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి వంటి నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు. వీళ్లంతా ఈ సారి పోటీలో నిలబడకుండా.. పార్లమెంటు బరిలో నిలవాలని భావిస్తున్నారు. అలాగే వీళ్లు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఎవరి విషయంలోనూ గ్యారెంటీ లేదు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పోటీ నెలకొంది. ఈటలతో పాటు పార్టీలో చేరిన తుల ఉమ వేములవాడ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తుంటే, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు కూడా ఇక్కడి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి మరికొన్ని చోట్ల మాత్రం పోటీ ఉంది.

మిగతా స్థానాల్లో చాలా వరకు పోటీ కనిపించడం లేదు. కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నేతలకే టిక్కెట్లు దక్కొచ్చు. రెండో విడత జాబితాపైనే బీజేపీ ఇంకా కసరత్తు చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఇప్పటికే వరుస ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. కాంగ్రెస్ కూడా బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్తోంది. ఎటొచ్చీ.. బీజేపీ మాత్రం టిక్కెట్లపై కసరత్తు దగ్గరే ఆగిపోయింది. జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇదంతా కావాలనే చేస్తోందా.. లేక.. ఏం చేయాలో తెలియడం లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.