TELANGANA BJP: బీజేపీ మూడో జాబితా.. వారికి దక్కని సీట్లు.. మిగిలిన వాటి సంగతేంటి..?

థర్డ్ లిస్ట్‌లో సీనియర్లతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశం కల్పించారు. ఈ లిస్టులో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కే ఉప్పల్ సీటు కేటాయించారు. మునుగోడు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు.

  • Written By:
  • Updated On - November 2, 2023 / 03:37 PM IST

TELANGANA BJP: తెలంగాణలో 35మంది అభ్యర్థులతో బీజేపీ (BJP) థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. క్యాండిడేట్స్ లిస్ట్‌ను ఢిల్లీలో రిలీజ్ చేశారు. బుధవారం నాడే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో ప్రధాని మోడీతోపాటు, అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. థర్డ్ లిస్ట్‌లో సీనియర్లతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశం కల్పించారు. ఈ లిస్టులో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కే ఉప్పల్ సీటు కేటాయించారు.

BRS సిట్టింగ్ MLA భేతి సుభాష్ రెడ్డి.. ఈమధ్యే బీజేపీలోకి వచ్చారు. దాంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ పార్టీ అధిష్టానం మాత్రం… ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న NVSSకే మళ్ళీ ఉప్పల్ టిక్కెట్ ఇచ్చింది. మొదటి లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంతో.. సీటు వస్తుందో రాదో అని అనుమానించిన బాబూ మోహన్‌కు మళ్ళీ ఆందోల్ టిక్కెట్ ఇచ్చారు. అంబర్ పేట్‌లో కృష్ణయాదవ్‌కు అవకాశం కల్పించారు. బీసీ నేతగా ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కమలం పార్టీకి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డికి సనత్ నగర్ నుంచి అవకాశం కల్పించారు. సీఎం KCR పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. నారాయణ్ ఖేడ్ టిక్కెట్ మాజీ జర్నలిస్ట్ సంగప్పకు దక్కింది. ముషీరాబాద్ టిక్కెట్ కోసం గవర్నర్ దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పూస రాజుకి కేటాయించారు. బీజేపీ టిక్కెట్ల కోసం అంబర్ పేట్, ముషీరాబాద్‌లో కార్పొరేటర్లు ప్రయత్నం చేశారు. కానీ వారికి ఎవరికీ టిక్కెట్ దక్కలేదు.

అయితే రాజేంద్ర నగర్ నుంచి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. బీజేపీ థర్డ్ లిస్ట్‌లో ఒకే ఒక మహిళకు అవకాశం దక్కింది. హుజూర్ నగర్ నుంచి శ్రీలతారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్ళడంతో.. మునుగోడు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. ఈమధ్యే కాంగ్రెస్ నుంచి వచ్చిన చలమల కృష్ణారెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని చెబుతున్నారు. కూకట్ పల్లి అభ్యర్థి పేరు ప్రకటించలేదు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిల్లో కొన్నింటిని జనసేనకు కేటాయించే అవకాశముంది. ఏయే సీట్లపై పొత్తు పెట్టుకుంటున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది .