తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన బీజేపీలో వర్గపోరు.. ఫలితాల తర్వాత మరింత తీవ్రమైంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు.. కార్పొరేటర్లు, మాజీ లీడర్లు.. ఇలా ఎవరికి వారే విడిపోయారు. ఒకళ్ళ మీ మరొకరు వీడియోలు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే.. బీజేపీకి వచ్చే ఆ ఒకట్రెండు ఎంపీ స్థానాలు కూడా రాకుండా పోయేలా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అధిష్టానం మార్చేసింది. ఆ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అప్పట్లో బండి సంజయ్ మీద ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ కలసి అధిష్టానానికి కంప్లయింట్ చేశారన్న వార్తలు వచ్చాయి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది బీజేపీ. కానీ ఆ పార్టీకి 8 సీట్లే దక్కాయి. ఎన్నికల్లో నిలబడ్డ ముగ్గురు ఎంపీలతో పాటు.. ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి కీలక నేతలు ఓడిపోయారు. బండి అధ్యక్షుడిగా ఉంటే.. ఎక్కువ సీట్లు వచ్చేవని ఆయన వర్గం కామెంట్స్ చేయడంతో.. దానిపై రఘునందన్ రావు ఘాటుగానే స్పందించారు. ఆయనే గెలవలేదు.. ఆయన ఎంపీ నియోజకవర్గంలోనూ ఎవరూ గెలవలేదు.. ఇక రాష్ట్రంలో ఎలా గెలిపిస్తాడు.. అని సంజయ్ పై విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో బీజేపీ నాయకులకు ఈమధ్య ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఫ్యాన్స్ పేరుతో ఒకరిపై మరొకరు తిట్టిపోసుకుంటున్నారు. బండి, ఈటల, కిషన్ రెడ్డిని తిడుతూనో.. పొగుడుతూనో.. పోస్టులు పెడుతున్నారు. దాంతో ఇంటి రచ్చ వీథికెక్కినట్టుగా ఉంది కమలం పార్టీ పరిస్థితి. ఈటల రాజేందర్ మాత్రం.. తన పేరుతో, తన ఫ్యాన్స్ పేరుతో వచ్చే మెస్సేజ్ లు ఏవీ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అవన్నీ ఫేక్ అని ప్రకటన చేశారు. అయినా ఫ్లో మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియానే కాదు.. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లో అదే పార్టీకి చెందిన లీడర్లు సమావేశాలు పెడుతున్నారు. కరీంనగర్ లో జరిగిన మీటింగ్ కు పెద్దపల్లి,కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని కమలం పార్టీ నేతలు హాజరయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్ కి కాకుండా వేరేవాళ్ళకి టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కొందరు లీడర్లు. సంజయ్ తీరుపై బీజేపీ అధిష్టానానికి కంప్లయింట్ చేస్తామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… తమ పార్టీలో కొందరు నేతల వల్లే ఓడిపోయానని బండి సంజయ్ బాహాటంగా అన్నారు. అందుకే ఆయనపై అసంతృప్తి ఉన్న నేతలంతా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ వ్యతిరేకత బండితోనే ఆగుతుందా.. లేకపోతే మిగతా నియోజకవర్గాల్లోనూ బీజేపీ అసంతృప్తులు ఇలా మీటింగ్స్ పెడతారా అన్నది చూడాలి.
అసెంబ్లీలో ఎలాగూ అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కనీసం పార్లమెంట్ ఎన్నికలకైనా పుంజుకుందామన్న ధ్యాస బీజేపీ లీడర్లలో కనిపించడం లేదు. నాయకుల్లో ఐక్యత లేకపోగా.. ఈసారి ఒకరిని ఓడించడానికి మరొకరు ప్రయత్నిస్తారా అన్న అనుమానాలు కూడా బీజేపీ కేడర్ లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కలలు గన్న ఆ పార్టీ అధిష్టానం.. సార్వత్రిక ఎన్నికల నాటికన్నా వీళ్ళందర్నీ గాడిలో పెడుతుందా.. అన్నడి చూడాలి. లేకపోతే మాత్రం.. బీజేపీకి మరోసారి ఘోర పరాభవం తప్పేలా లేదు.