TELANGANA BJP: బీజేపీ థర్డ్ లిస్ట్ సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. పోటీ చేయాలని భావించిన ఇద్దరు కీలక మహిళ నేతలకు నిరాశే మిగిలింది. కమలదళం టిక్కెట్లు నిరాకరించింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మికి బీజేపీ మొండిచేయి చూపింది. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి విజయలక్ష్మి టికెట్ ఆశించారు. ఐతే ఇక్కడి నుంచి పూస రాజుకు అవకాశం కల్పించింది కమలం పార్టీ. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బండారు దత్తాత్రేయ పలుమార్లు విజయం సాధించారు.
కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి యాక్టివ్‌గా ఉన్నారు. ముషీరాబాద్ నుంచి పోటీకి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారు కూడా ! ఐతే ఈ స్థానం నుంచి రాజుకు టికెట్ కేటాయించింది బీజేపీ. ఇక అటు సికింద్రాబాద్ అసెంబ్లీ సీటును బండ కార్తీక రెడ్డి ఆశించారు. ఈ స్థానం నుంచి మేకల సారంగపాణికి టిక్కెట్ కేటాయించింది. దీంతో బండ కార్తీకరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి నేతల భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ లిస్ట్ తర్వాత.. బీజేపీలో రేగిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. పైడి రాకేశ్ రెడ్డిలాంటి నేతలు కూడా కాషాయం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మరి ఇప్పుడు థర్డ్ లిస్ట్‌తో పార్టీలో ఏం జరగబోతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. ముషీరాబాద్ నుంచి పూసరాజుకు టికెట్ కేటాయించడంపై కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. విజయలక్ష్మిని పక్కనపెట్టి మరీ పూస రాజుకు టికెట్ ఇచ్చేంత ప్రత్యేకత ఏముంది అనే చర్చ జరుగుతోంది.
నిజానికి రాజు విషయంలో బీజేపీ నిబంధనలను కూడా తుంగలో తొక్కిందనే ప్రచారం జరుగుతోంది. టికెట్ కేటాయించే సమయానికి రాజు ట్విట్టర్ అకౌంట్‌లో ఇద్దరంటే ఇద్దరు ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. టికెట్ కావాలంటే.. సోషల్ మీడియాలో కనీసం 25వేల మంది ఫాలోవర్లు ఉండాలని బీజేపీ పెద్దలే చెప్పారు. అలాంటిది ఇద్దరు ఫాలోవర్లు ఉన్న రాజుకు టికెట్ కేటాయించడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఐతే బీసీలకు పెద్దపీట వేసే కార్యక్రమంలో భాగంగా పూస రాజుకు టికెట్ కేటాయించారని బీజేపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నా.. అక్కడ బీఆర్ఎస్‌కు మేలు చేసేలా అభ్యర్థి ఎంపిక జరిగిందని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.