Telangana Congress: సీట్ల పంపకాలు కాంగ్రెస్ పార్టీకి తలపోటుగా మారిపోయాయ్. ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. కామ్రేడ్లతో పొత్తు బెడిసికొట్టింది. కాంగ్రెస్ కేటాయించిన కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐ అంగీకరించగా.. సీపీఎం మాత్రం తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది సీపీఎం.
పార్టీని బలిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని.. వైరా, మిర్యాలగూడ టికెట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని క్లియర్‌కట్‌గా చెప్తున్నారు సీపీఎం నాయకులు. మంగళవారం లోపు క్లారిటీ ఇవ్వాలని ఆ పార్టీ నేత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అల్టిమేటం జారీ చేసారు. తమకు బలమున్న చోట కాకుండా మరోచోట ఎక్కడో సీటు ఇస్తే తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని తమ్మినేని తెగేసి చెప్పారు. ఇక అటు తాము కోరిన మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వకుంటే ఒంటరి పోరుకు దిగుతామని క్లియర్‌కట్‌గా చెప్పేసింది సీపీఎం. దీంతో దాదాపు సీపీఎం, కాంగ్రెస్ పొత్తు బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోరగా ఈ అభ్యర్థనను కాంగ్రెస్ తిరస్కరించింది. దీంతో సీపీఎం సింగిల్‌గానే బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలను రిలీజ్ చేయగా అసంతృప్తులతో తెగ ఇబ్బందులు పడుతోంది.
సీట్లు దక్కని వారంతా పార్టీకి రాజీనామా చేస్తుండగా కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వామపక్షాలతో పొత్తు బెడిసికొట్టడం కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికర పరిణామమే అనే చర్చ జరుగుతోంది. ఈ పొత్తుపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.