CONGRESS: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉత్సాహం కనిపిస్తుంది అనుకుంటే.. గాంధీభవన్ గదుల్లో యుద్ధం వినిపిస్తోందిప్పుడు ! టికెట్ రాని నేతలంతా గాంధీభవన్ వెలుపల, లోపల ఆందోళనకు దిగుతున్నారు. మరికొందరు నేతలయితే.. రేవంత్‌కు ఘాటు వార్నింగ్‌లు ఇస్తున్నారు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని ఇంకొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. సీనియర్ల సంగతే ఎటూ అర్థం కాని పరిస్థితి.
ఉద్యమంలో పదవులు త్యాగం చేసిన వారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పిల్లర్‌లాంటి వాళ్లు అనుకున్న నేతలకు ఫస్ట్ లిస్ట్‌లో అవకాశం దక్కలేదు. తొలి జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్ నేతలు మధుయాష్కీ, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. తుమ్మల, పొంగులేటి సంగతి వేరు. ఖమ్మం, పాలేరు స్థానాల విషయంలో ఇద్దరి మధ్య చిక్కుముడి వచ్చింది. రాహుల్ దగ్గర సమస్యకు పరిష్కారం కూడా దొరికింది. ఈ లెక్కన వీరిద్దరు సేఫ్. ఇద్దరికీ టికెట్ కన్ఫార్మ్. మిగిలిన సీనియర్ల సంగతే అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా మధు యాష్కీ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ విషయంలో మరిన్ని అనుమానాలు వినిపిస్తున్నాయ్. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ ఓ డిక్లరేషన్ చేసుకుంది. ఈ లెక్కన సీనియర్లలో చాలామంది అలాంటి పరాభవం ఎదుర్కున్న వారే! అందుకే వీళ్లకు టికెట్ ఆపారా.. వీళ్లకు పోటీ చేసే చాన్స్ రావడం కష్టమేనా అనే చర్చ జరుగుతోంది.
షబ్బీర్ అలీ, పొన్నం సంగతి ఎలా ఉన్నా.. మధు యాష్కీకి చాలా అడ్డంకులే ఉన్నాయ్. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని మధు యాష్కీ భావిస్తుండగా.. అక్కడ సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మొదటి జాబితాలో ప్రకటించిన 55 స్థానాలు కూడా ఎలాంటి వివాదాల్లేవ్. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమే ఇప్పుడు హస్తం పార్టీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడం.. స్ర్కీనింగ్ కమిటీకి కత్తిమీద సాములాంటిదే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇటు బీసీలు, అటు వివిధ సామాజికవర్గాల వారు సీట్లలో వాటా తేల్చాలని ఒత్తిడి తెస్తున్నారు. పైగా సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంది. దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తకిరంగా మారింది.