TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించగా.. వాళ్లంతా జనాల్లోనే ఉంటున్నారు. ఓటరు మనసు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే కాంగ్రెస్ మాత్రం ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయలేదు. వడపోతల మీద వడపోతలు చేపడుతోంది ఇంకా. ఇప్పుడు కూడా బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన అని చెప్తోంది. ముందు బస్సు యాత్ర.. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన అని తేల్చిచెప్తోంది. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచుతున్నా.. దీని వెనక కాంగ్రెస్ భారీ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.
అన్నిటికంటే ముందుగా బీఆర్ఎస్.. తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, నియోజకవర్గాలవారీగా కేసీఆర్ భారీ బహిరంగ సభలు నిర్వహించే ప్లాన్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినా.. మరికొద్ది రోజులపాటు దానిని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించింది. నియోజకవర్గాల వారీగా గెలిచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే.. కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచనతో ఉందట. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులంతా జనాల్లోకి వెళ్లే విధంగా వివిధ కార్యక్రమాలు ఇప్పటికే రూపకల్పన చేశారు. ఇక అటు అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినా.. ముందుగా అనుకున్న ప్రకారం తెలంగాణలో బస్సు యాత్రను పూర్తి చేసి.. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట.
ఈనెల 14 తర్వాత మరికొన్ని చేరికలు ఉండబోతుండడం.. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పార్టీలో చేరే అవకాశం ఉండడంతో.. మరికొద్ది రోజుల పాటు వేచి చూస్తే మంచిదనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. భారీగా చేరికలను ప్రోత్సహించి బలమైన అభ్యర్థులను పోటీకి దించాలని ప్లాన్‌లో ఉంది. అందుకే బస్సు యాత్ర మొదలుపెట్టి.. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట. ఐడియా అయితే బాగానే ఉంది కానీ.. సరైన ఫలితాలు ఇస్తుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.