TELANGANA ELECTIONS: ఈ నెల 31 వరకు ఓటు హక్కు దరఖాస్తు ఛాన్స్.. లౌడ్ స్పీకర్లపై ఈసీ ఏం చెప్పిందంటే..!

ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. అయితే, చిరునామా మార్పు దరఖాస్తుల్ని పెండింగ్‌‌లో పెట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డుకు బదులుగా ప్రభుత్వం జారీ చేసే ఇతర 12 కార్డులు వినియోగించుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 07:47 PM IST

TELANGANA ELECTIONS: ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంత మాత్రాన ఓటు హక్కు దరఖాస్తు ప్రక్రియ ఆగిపోదని ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్ రాజ్ అన్నారు. ఈ నెల 31వ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్ని వివరించేందుకు వికాస్ రాజ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. అయితే, చిరునామా మార్పు దరఖాస్తుల్ని పెండింగ్‌‌లో పెట్టారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డుకు బదులుగా ప్రభుత్వం జారీ చేసే ఇతర 12 కార్డులు వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి రాజకీయ నేతల ఫొటోలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదుల కోసమైనా 1950 నెంబర్‌ను సంప్రదించాలి. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపి బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి. ఎన్నికల ప్రకటనలకు సంబంధించి ముందుగా ఈసీ అనుమతి తీసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్‌లోని అన్ని విషయాలను అభ్యర్థులు కచ్చితంగా నింపాలి. అసంపూర్తిగా నింపిన నామినేషన్లను తిరస్కరిస్తారు. బ్యాలెట్ పేపర్‌లో పార్టీ, ఎన్నికల గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు కూడా ముద్రిస్తారు.

సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం అలాంటి పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు తయారు చేసే పనిలో ఉన్నారు. ప్రచారానికి సంబంధించి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు ఎలాంటి అనుమతి లేదు. నిర్ణీత సమయంలో మాత్రమే స్పీకర్లు వాడాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సాధారణ ప్రజలైనా, నాయకులైనా నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రూ.50 వేలకు మించిన నగదును తీసుకెళ్లేవాళ్లు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. నగదు పంపిణీ జరగకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. అందుకే నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేని నగదు, మద్యం, ఆభరణాలు వంటి వాటిని అధికారులు సీజ్ చేస్తారు.