తెలంగాణ (Telangana) ఎప్పుడూ చూడని పరిణామాలు ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. కేసీఆర్ (KCR) ను టార్గెట్ చేసిన విపక్షాలు.. ఆయన మీద పోటీకి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నారు. ఐతే గజ్వేల్ (Gajwel) లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నుంచి ఈటల బరిలో దిగుతుండగా.. కామారెడ్డి (Kamareddy) లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. గజ్వేల్ సంగతి ఎలా ఉన్నా.. కామారెడ్డితో రేవంత్ పోటీ వ్యవహారమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి గెలవగలను అనుకుంటున్నారా.. అసలు రేవంత్ రెడ్డిది ఆత్మవిశ్వాసమా, అహంకారమా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ను ఓడించడమే కాదు.. కేసీఆర్‌ను కూడా ఓడించి తీరుతానని రేవంత్ పదేపదే చెప్తున్నారు.
రేవంత్ (Revanth Reddy)కు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి, ఎందుకు అనే చర్చ జరుగుతోంది రాజకీయాన్ని పరిశీలిస్తున్న ప్రతీ ఒక్కరిలో ! చేరికలు కావొచ్చు, జనాల్లో మార్పు కావొచ్చు.. కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతున్న మాట నిజమే. ఐతే అధికారంలోకి వచ్చేంతా బలం కాంగ్రెస్‌కు ఉందా అంటే.. అది కచ్చితంగా సమాధానం చెప్పలేని ప్రశ్నే! ఐతే కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గజ్వేల్ నుంచి తూంకుంట నర్సారెడ్డికి సీటు కేటాయించింది. ఇక కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలో దించితే ఎలా ఉంటుందనే దానిపై హస్తం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్‌తో ఢీ కొట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనెల 7న నామినేషన్ కూడా వేస్తారనే ప్రచారం జరుగుతోంది.
కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీకొట్టి రేవంత్ నిలువగలరా అంటే అంతా ఈజీ కాదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్.. దారుణ పరాభవం మూటగట్టుకున్నారు. ఈసారి కూడా కొడంగల్‌లో రేవంత్‌కు గట్టి పోటీ కాయం అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో సొంత పార్టీలో కుమ్ములాటలే.. కొడంగల్‌లో కీలకంగా మారే చాన్స్ ఉంది. అలాంటిది కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో పోటీకి రేవంత్ సిద్ధం కావడం అతివిశ్వాసమే అని కొందరు అంటుంటే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. రేవంత్ ఎక్కడ నిల్చున్నా, ఎవరు ఎదురున్నా గెలుస్తారని మరికొందరు అంటున్నారు. ఏమైనా ఈసారి ఎన్నికలు మునుపటిలా ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు.