BRS Ex Ministers ఎంపీ సీట్ల వేటలో ఓడిపోయిన తెలంగాణ.. బీఆర్ఎస్ మంత్రులు..

తెలంగాణలో BRS కు చెందిన మాజీ మంత్రులు మళ్ళీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. అసెంబ్లీలో పోగొట్టుకున్నదాన్ని పార్లమెంట్‌లో వెదుక్కోవాలనుకుంటున్నారు.

Telangana Ex Ministers : తెలంగాణలో BRS కు చెందిన మాజీ మంత్రులు మళ్ళీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. అసెంబ్లీలో పోగొట్టుకున్నదాన్ని పార్లమెంట్‌లో వెదుక్కోవాలనుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆరుగురు బీఆర్‌ఎస్‌ మంత్రులూ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆ మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ జరుగుతోంది గులాబీ వర్గాల్లో. వాళ్లతో పాటు పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యులు కూడా ఓడిపోవడంతో.. ఇప్పుడు రాజకీయంగా అందరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న ఆసక్తి పెరుగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డితో పాటు కొందరు కీలక నేతలు ఓడిపోయారు. BRSలో అంతా ముఖ్యమైన నాయకులే కావడంతో.. మారుతున్న పరిస్థితుల్లో వీరిలో కొందరు లోక్‌సభ ఎన్నికల మీద దృష్టి పెట్టారా? ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

పార్లమెంట్‌ ఎన్నికలకు ఇక వంద రోజులే సమయం ఉండటంతో.. ఆ మాజీలు పోటీకి ఆసక్తి చూపుతారా? ఒకవేళ కొందరు ఆసక్తిగా ఉన్నా.. పార్టీ అధినాయకత్వం అవకాశం ఇస్తుందా..? ఇలా రకరకాల కోణాల్లో విశ్లేషిస్తూ మాట్లాడుకుంటున్నారట గులాబీ నేతలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భువనగిరి లోక్‌సభ సీటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి బరిలో ఉంటే ఉండే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లపై ఆయన ఇప్పటికే నజర్‌ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల్క సుమన్ మరోసారి పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపితే గులాబీ హైకమాండ్ ఓకే చెబుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. రాన్రాను ఈ లిస్ట్‌లో మరికొన్ని పేర్లు చేరవచ్చంటున్నారు. దీంతో మాజీల్లో ఎవరెవరు తిరిగి పోటీపై ఆసక్తిగా ఉన్నారన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. లోకసభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు, రాష్ట్రంలో ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎక్కువ మంది మాజీలు పోటీకి ఆసక్తి కనబరిస్తే.. BRS అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.