TELANGANA ASSEMBLY ELECTIONS: పోటీకి దూరంగా టీడీపీ.. ఏ పార్టీకి లాభం..?

చంద్రబాబు నాయుడుకు చెందిన కమ్మ సామాజికవర్గం ఇంకా ఆ పార్టీని అభిమానిస్తుంటుంది. అలాగే ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైన మరికొందరు కూడా టీడీపీకి మద్దతిస్తూ ఉంటారు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే వాళ్లంతా అండగా నిలిచే వాళ్లు.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 02:25 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే, టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఏ పార్టీకి కలిసొస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలోలాగా తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం ఆదరణ లేదు. ఒకప్పుడు తెలంగాణలోని వాడవాడలా టీడీపీ పేరు వినిపించేది. కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత క్రమంగా టీడీపీ కనుమరుగైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి మాత్రం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు చెందిన కమ్మ సామాజికవర్గం ఇంకా ఆ పార్టీని అభిమానిస్తుంటుంది. అలాగే ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైన మరికొందరు కూడా టీడీపీకి మద్దతిస్తూ ఉంటారు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే వాళ్లంతా అండగా నిలిచే వాళ్లు. కానీ, ఇప్పుడా అవకాశం లేదు. దీంతో ఇప్పుడు వాళ్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అనేది కీలకంగా మారింది. ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాల్లో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. నిజానికి తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు. కానీ, ఇతర పార్టీల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు బదిలీ అవుతుంది. అయితే, తాజా రాజకీయ పరిణామాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధం అని కేటీఆర్ వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో చేపట్టాలనుకున్న నిరసనల్ని కూడా ప్రభుత్వం అణచివేసింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న టీడీపీ మద్దతుదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

పైగా ఏపీలోని అధికార వైసీపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న చంద్రబాబు సానుభూతిపరులు ఈసారి బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువే. ఈ విషయం గుర్తించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత చంద్రబాబుకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ, ఆలోపే నష్టం జరిగిపోయింది. గత ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించింది. కానీ, ఈసారి కష్టమనే వాదన వినిపిస్తోంది. అలాగే చంద్రబాబు అరెస్టులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర ఉందనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి కూడా ఓటేసే అవకాశాలు తక్కువే. అందువల్ల ఈ సారి టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారేమో అనే వాదన వినిపిస్తుంది. ఫలితాలు వెల్లడైతేగానీ.. ఈ విష‍యం తెలియదు.