తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కలతో నరాలు తెగుతున్నాయట నాయకులకు. మరీ ముఖ్యంగా ఈసారి అధికారం రేసులో లేకున్నా.. కమలం పార్టీ మిగతా వాళ్ళని కంగారు పెడుతోందట. ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న అంచనాలు మిగతా వాళ్ళకి నిద్ర పట్టనివ్వడం లేదట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి. బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి.. వాటి ప్రభావం ఎంత అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో 70శాతం పోలింగ్ అయింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. తమవైన ఈక్వేషన్స్‌తో గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.
BRS : గ్రేటర్ మీదే బీఆర్ఎస్ ఆశలు.. హైదరాబాద్ ఆదుకుంటుందా..?
క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అరా తీస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ క్రమంలోనే కమలం పార్టీ నేతలు కూడా వివిధ మార్గాల్లో సమాచార సేకరణ చేస్తున్నారట. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కడైతే ప్రభావం చూపిందో.. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారట కమలనాధులు. కింది స్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించుకుంటే.. ఈ విషయమే తేలుతోందంటోంది కాషాయదళం. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉండడం.. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదం లాంటివి కలిసొస్తాయన్నది బీజేపీ లెక్కగా తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా చూపారని.. వాస్తవానికి తమ ఓట్ బ్యాంక్ అనూహ్యంగా పెరిగిందని అంచనా వేస్తున్నారట కాషాయ నేతలు. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో తమకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. కామారెడ్డిని కూడా తమ ఖాతాలోనే వేసుకుంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, న్యూట్రల్ ఓట్లు తమకే పడ్డాయని అభిప్రాయపడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ఇతర పార్టీలకి షిఫ్ట్ అయిందని.. ఈసారి తమ ఓట్లు పూర్తిగా తమకే పడ్డాయని అంటున్నారు టీబీజేపీ నేతలు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చాలా నియోజకవర్గాల్లో బలమైన నేతలు బరిలో ఉన్నారని.. పార్టీకి వారి సొంత బలం కూడా జత అయిందని.. రాష్ట్రమంతటా తమ ఓటు శాతం పెరుగుతుందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 7శాతం. ఇప్పుడు ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీ కొంప మునుగుతుందోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రకరకాల సమీకరణాల్ని తెర మీదికి తెస్తూ లెక్కలేసుకుంటున్నాయి మిగతా పార్టీలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ చీలిస్తే.. అంతిమంగా అది తమకే లాభిస్తుందని లెక్కగడుతోందట బీఆర్‌ఎస్. అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఓటింగ్ పెరిగిందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయ్. దీంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలతాయని, తమకు అడ్వాంటేజ్ అవుతుందన్నది కారు పార్టీ లెక్కగా చెప్తున్నారు. 2018 ఎన్నికల్లో దాదాపు వందల స్థానాల్లో బీజేపీకి డిపాజిట్స్ దక్కలేదు. అలాంటిది ఈసారి బలం పెరిగిందన్న అంచనాల నడుమ ఆ పార్టీ చీల్చే ఓట్ల మీద మిగతా పక్షాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.