Congress : తెలంగాణ గట్టుపై పిడికిలి బిగించిన చేయి.. కాంగ్రెస్ విజయం వెనక ఇంత ఉందా..!

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..! అన్న మాట ఫలించింది. కాంగ్రెస్ ను తెలంగాణలో విజయ తీరాలకు చేర్చింది. సర్వేలు అనుకూలంగా వచ్చినా.. లోలోన మాత్రం భయం వెంటాడి చెయ్యి వణికింది. ఎందుకంటే గతంలో కూడా అలాగే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది కాంగ్రెస్‌.

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..! అన్న మాట ఫలించింది. కాంగ్రెస్ ను తెలంగాణలో విజయ తీరాలకు చేర్చింది. సర్వేలు అనుకూలంగా వచ్చినా.. లోలోన మాత్రం భయం వెంటాడి చెయ్యి వణికింది. ఎందుకంటే గతంలో కూడా అలాగే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది కాంగ్రెస్‌. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. వరసగా రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టి.. మాంఛి జోరు మీద ఉన్న కారుకు నాలుగు టైర్లూ పంచరైపోయాయ్‌. జనం మెచ్చి.. ఇచ్చిన బలంతో కండలు పెంచిన హస్తం.. అదే ప్రజా బలంతో తెలంగాణ గట్టు మీద పిడికిలి బిగించి చెయ్య లేపి తన సత్తా చాటింది. కాంగ్రెస్‌ అంటేనే కలహాల కుంపటి..! నాయకుల మధ్య సయోధ్య కుదరని పరిస్థితి..! ఆ పార్టీలో ఒక్కడు సరైనోడు లేడు.. బలమైనోడు రాడు అంటూ విమర్శలు చేసిన ప్రత్యర్ధుల మాట పడిపోయేలాంటి రిజల్ట్‌ చూపించింది హస్తం. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సేనని గతంలో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వర్కవుట్‌ కాలేదు.

2023లో మాత్రం ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓ విధంగా హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఏదో ఒక కార్యక్రమంతో జనంలో నిత్యం తిరుగుతూ వచ్చారు కీలక నేతలు. దీనికి తోడు ఢిల్లీ నుంచి గాంధీ ఫ్యామిలీ సైతం వచ్చి ఇక్కడ మకాం వేసి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చింది. ఇదంతా ఒకెత్తయితే.. ఆరు గ్యారెంటీలు కలిసివచ్చి సంజీవనిలా పనిచేశాయి. నిశ్శబ్ధ విప్లవంలా వాడవాడల్లోనూ కాంగ్రెస్‌ కంచు కంఠం మారుమోగింది. ఇన్ని విధాలుగా కష్టించి.. శ్రమించి… చెమటోడ్చిన ఫలితమే.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించి… హస్తాన్ని తెలంగాణ సింహాసనం ఎక్కించింది..! మరి రాకరాక అందివచ్చిన అవకాశాన్ని.. సమర్థవంతంగా.. సావకాశంగా.. వినియోగించుకుని.. నేతలంతా కలహాలను పక్కనపెట్టి.. కలసిమెలసి, కలసికట్టుగా ముందుకు సాగి సమయస్పూర్తితో, పారదర్శకతతో ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా ఎలా పాలిస్తారు? కష్టాల అష్టదిగ్బంధనం నుంచి తెలంగాణకు ఎలా విముక్తి కల్పిస్తారన్నది చూడాలి.