తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారానికి సిద్ధమైంది. నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారు. అదే రోజు మిగిలి అభ్యర్థులకు కూడా బీఫాంలు అందిస్తారు. ఇక నవంబర్ 15న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే బీఆర్‌ఎస్ తన మేనిఫెస్టే విడుదల చేయబోతోంది. ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. అయితే కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు కాకుండా, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా లేని హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హుస్నాబాద్‌లో అంత ప్రత్యేక ఏముంది. ఎందుకు కేసీఆర్ ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించాలి అనుకుంటున్నారు అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే ఇందులో పెద్ద విషయమేమీ లేదు. ముందు నుంచీ కేసీఆర్ హుస్నాబాద్‌ను సెంటిమెంట్‌గా ఫీలవుతుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నిక ప్రాచారం ప్రారంభించి ఘన విజయం సాధించింది. ఆ తరువాత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్.. సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ముందు నుంచీ కేసీఆర్‌కు ఇలాంటి సెంటిమెంట్లు చాలా ఉంటాయి. దీంతో ఈ సారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారట గులాబీ బాస్. జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎదుర్కుంటున్న మొదటి ఎన్నిక కావడం, ప్రతిపక్షాలు ఈసారి బలంగా ఉండటంతో ఈ ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకే బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. హుస్నాబాద్ సభలోనే ఆ మేనిఫెస్టోనో కేసీఆర్ రిలీజ్ చేయబోతున్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు అధికారాన్ని ఇచ్చిన హుస్నాబాద్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.