TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా..? పార్టీ భవిష్యత్ ఏంటి..?

తెలంగాణ విషయంలో టీడీపీ సానుకూలంగానే ఉంది. ఇక్కడ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని చంద్రబాబు భావించారు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణకు అధ్యక్షుడిని చేశారు. హైదరాబాద్, ఖమ్మం వంటి చోట్ల సభలూ నిర్వహించారు. ఇలా పలు చోట్ల తెలంగాణ టీడీపీ సత్తా చాటింది.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 02:41 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఇదే కోవలో జనసేన కూడా పోటీలో ఉండబోతున్నట్లు ప్రకటించింది. అయితే, ఎటోచ్చీ టీడీపీ పరిస్థితి ఏంటనేదే అర్థం కావడం లేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా.. అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. నిజానికి తెలంగాణలో టీడీపీకి కొన్ని చోట్ల మంచి పట్టుంది. ముఖ్యంగా ఆంధ్రా వాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒక సామాజికవర్గం మద్దతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ తాజా ఎన్నికల్ని ప్రభావితం చేయగలదు. సరైన అభ్యర్థుల్ని రంగంలోకి దిగితే కాస్త మెరుగైన ఫలితాల్నే సాధించే వీలుంది. అయితే, ఇంతవరకు టీడీపీ నుంచి ఈ దిశగా ఎలాంటి కార్యాచరణ వెలువడలేదు.
తెలంగాణ విషయంలో టీడీపీ సానుకూలంగానే ఉంది. ఇక్కడ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని చంద్రబాబు భావించారు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణకు అధ్యక్షుడిని చేశారు. హైదరాబాద్, ఖమ్మం వంటి చోట్ల సభలూ నిర్వహించారు. ఇలా పలు చోట్ల తెలంగాణ టీడీపీ సత్తా చాటింది. అయితే, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా.. లేదా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలులో ఉండటంతో ఈ విషయంలో పార్టీకి దిశానిర్దేశం చేసేవాళ్లు కరువయ్యారు. లోకేశ్ వంటి నేతలు ఏపీ గురించి, చంద్రబాబు విడుదల గురించి చర్చించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీని పట్టిచుకునే వాళ్లు లేకుండాపోయారు. దీంతో పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి.

అయితే, కాసాని జ్ఞానేశ్వర్‌ రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి, ఈ అంశంపై చర్చించారు. కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, చంద్రబాబు ఈ వారం బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు.. ఆయన రిలీజైన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీటీడీపీ రెడీ అవుతోంది. ఇప్పటికే 87 స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్నారు. అవసరమైతే తెలంగాణ బాధ్యతలు తీసుకునేందుకు బాలకృష్ణ కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.