Vijayashanti: బీజేపీకి మరో నేత గుడ్‌ బై చెప్పబోతున్నారా..? ఆ ట్వీట్‌కు అర్థం ఏంటి..?

విజయశాంతి.. బీజేపీలో ఉన్నట్లే అనిపిస్తున్నారు కానీ ఉండరు అనే పేరు ఉంది. పార్టీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో రగిలి పోతున్నారు ఆవిడ. ఐతే ఇప్పుడు పార్టీ జంప్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఓ ట్వీట్‌.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 08:12 PM IST

Vijayashanti: ఇక్కడ హ్యాండ్ ఇవ్వబడును అని బోర్డు పెట్టుకున్నట్లు ఉంది తెలంగాణ బీజేపీ ఆఫీస్ ముందు. ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి హ్యాండ్ ఇస్తూ.. చేతిలో చేయేసి నడుస్తున్నారు. ముందు కోమటిరెడ్డి.. ఆ తర్వాత వివేక్.. ఇప్పుడు నెక్ట్స్ ఇంకొకరు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారి మాటలతో రాతలతో అర్థం అవుతోంది. రాములమ్మ అలియాస్ విజయశాంతి.. బీజేపీలో ఉన్నట్లే అనిపిస్తున్నారు కానీ ఉండరు అనే పేరు ఉంది. పార్టీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో రగిలి పోతున్నారు ఆవిడ.

ఐతే ఇప్పుడు పార్టీ జంప్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఓ ట్వీట్‌. రాములమ్మ ఓ ట్వీట్‌ చేసింది. అందులో కనీసం ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు. జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారే కానీ.. జై బీజేపీ అని అనలేదు. దీంతో విజయశాంతి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని చెప్పుకొచ్చారు విజయశాంతి. ఏ పదవీ, ఏనాడూ కోరుకోకున్నా, ఇప్పటికీ అనుకోకున్నా కూడా.. సంఘర్షణ మాత్రమే మిగిలిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం ఇదీ అంటూ ఆమె సుదీర్ఘ ట్వీట్ వేశారు. తమ పోరాటం మొదలైంది తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే. కానీ బీఆర్ఎస్‌కి వ్యతిరేకం అవుతామని కాదని చెప్పారామె. తన పోరాటం కేసీఆర్ కుటుంబంపైనే కానీ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదన్నారు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనేదే తన కోరిక అన్నారు విజయశాంతి. రాములమ్మ ట్వీట్‌లో అంతరార్థమేంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలామె బీఆర్ఎస్‌కి అనుకూలంగా ట్వీట్ వేశారా.. లేక బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనేది తేలడంలేదు.

ఆమె ట్వీట్‌లో కనీసం ఒక్క సారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు. జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారే కానీ, జై బీజేపీ అని అనలేదు. మొత్తానికి రాములమ్మ మనసులో ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది. ఈ మధ్య వరుస మీటింగ్‌లకు డుమ్మా కొడుతున్న రాములమ్మ.. పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. కీలక నేతలంతా కమలానికి గుడ్ బై చెబుతున్న ఈ దశలో విజయశాంతి నిర్ణయం ఏంటి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.