Vivek Venkata Swamy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. బీజేపీ వర్గాలను టెన్షన్ పెడుతున్న న్యూస్ ఇది. చాలా కాలంగా బీజేపీలో అసంతృప్త నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారంటూ ఆయన అనుచర వర్గంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎల్బీనగర్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారని.. ఆ విషయంలో క్లారిటీ రాగానే నెక్ట్స్ మినట్ కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు రెడీగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకుండానే మరో కీలక బీజేపీ నేత కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో మంచి గ్రిప్ ఉన్న కీలక నేత వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు వివేక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మంచి పట్టు ఉన్న వివేక్ తమ పార్టీలోకి వస్తే తమకు లాభం చేకూరుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా వివేక్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఆయన సింగపూర్‌లో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చిన వెంటనే తన నిర్ణయం చెప్తారంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే టైంలో వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రీసెంట్‌గా బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్‌లో రాజగోపాల్‌తో పాటు వివేక్‌కు కూడా టికెట్ కేటాయించలేదు. దీంతో ఈ కారణంగానే ఈ ఇద్దరూ పార్టీ మారాలనే అలోచనలో ఉన్నారని టాక్. దీనికి తోడు రీసెంట్‌గా ఈ అసంతృప్త నేతలంతా రహస్యంగా మీటింగ్ కూడా పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా పార్టీ వీడే అంశంపై ఆ మీటింగ్‌లో చర్చ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు రావడం.. ఆ వార్తలను బీజేపీ పెద్దలు ఖండించకపోవడంతో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయనే ఆసక్తి మొదలైంది.