Vivek Venkatswamy: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ వివేక్‌.. రేవంత్‌తో భేటీ.. బీజేపీకి వివేక్ హ్యాండిస్తారా..?

బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. వివేక్ కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా ఇప్పుడు బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 01:46 PM IST

Vivek Venkatswamy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల నాటికి ఎవరు, ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఒక పార్టీలో టిక్కెట్ దక్కని నేతలు, అసంతృప్తులంతా మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఇలా జంప్ కాగా.. ఇప్పుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. వివేక్ కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు.

ఆ పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా ఇప్పుడు బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయాలి అనుకుంటుంటే.. అధిష్టానం మాత్రం అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశించింది. దీనిపై కూడా వివేక్ అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ వెంకట స్వామి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ పార్టీ మారుతారని, కాంగ్రెస్‌లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయితే, తాజాగా చూస్తే ఈ పరిణామాలు మారినట్లు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని వివేక్‌ ఫామ్‌హౌజ్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.. వివేక్‌ వెంకటస్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.

దీనికి వివేక్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వివేక్.. తన అనుచరులతో చర్చించి, త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డితోపాటు వివేక్ కూడా పార్టీ వీడుతారన్న ప్రచారం జరిగింది. అయితే, వివేక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్‌లోనే. అందువల్ల ఆయన సొంతగూటికి చేరడానికి సిద్ధమైనట్లే.