Quthbullapur: కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం.. ఎప్పుడూ చర్చల్లోనే ఉండే స్థానం ఇది. నిన్నటి నుంచి మరీ డిస్కషన్ నడుస్తోంది దీని గురించి ! బీజేపీ అభ్యర్థి మీద సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద.. మీడియా సాక్షిగా దాడి చేశాడు. దీంతో.. అసలు కుత్బుల్లాపూర్‌లో ఏం జరుగుతుందా అనే చర్చ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కుత్బుల్లాపూర్. ఫార్మా కంపెనీలకు కేరాఫ్‌గా ఉండడమే కాదు.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న ప్రాంతం కూడా ఇదే.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిలయంగా మారిన కుత్బుల్లాపూర్‌లో విజయాన్ని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయ్. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కుత్బుల్లాపూర్ ఒకటి. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలున్న నియోజకవర్గంగా కుత్బుల్లాపూర్‌కు ప్రత్యేకత ఉంది. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం లాంటి ప్రాంతాల్లో.. నిత్యం రెండు లక్షల మంది కార్మికులు.. వివిధ కంపెనీల్లో పనిచేస్తుంటారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. 1250కి పైగా మేజర్ కంపెనీలున్నాయి. ఐతే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్ నుంచి కొలను హన్మంత రెడ్డి, బీజేపీ నుంచి కూన శ్రీశైలం గౌడ్ బరిలో దిగబోతున్నారు. కుత్బుల్లాపూర్‌లో రెడ్డి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు ఓట్లు చాలా కీలకం. గౌడ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే.. గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్లలో.. 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవగా, ఒకటి బీజేపీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో.. ఈ కార్పొరేటర్లు కీలకం కానున్నారు. పార్టీ బలాబలాల సంగతి చూస్తే.. మూడు పార్టీలను ఇక్కడ వర్గపోరు ఇబ్బంది పెడుతోంది. వివేకానంద హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే జనాల్లో వ్యతిరేకత లేకపోయినా.. సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచి ఎదురుగాలి వీస్తోంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఈసారి వివేకా మీద కారాలు, మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ ఎన్నికల్లో కీలకంగా మారే చాన్స్ ఉంది. లుకలుకలు సెట్ చేసుకోకపోతే.. వివేకకు షాక్ తగలడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయ్. ఇక కాంగ్రెస్ నుంచి కొలను హన్మంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఈయనకు.. హస్తం పార్టీ టికెట్ ఇచ్చింది. ఐతే ఇది స్థానికంగా ఉన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి అసంతృప్తికి కారణం అవుతోంది. దీంతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది.
ఐతే అధిష్టానం బుజ్జగింపుతో వీళ్లంతా ఒక్కతాటి మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అటు బీజేపీని కూడా వర్గపోరు ఇబ్బంది పెడుతోంది. శ్రీశైలం గౌడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కీలక నేతగా ఉన్న వాసు.. బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌తో కంపేర్ చేస్తే.. కుత్బుల్లాపూర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాజకీయంగా లైన్ క్లియర్‌గా ఉన్నట్లు జనాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఐతే రాజకీయ పరిణామాలు మారిపోవడానికి.. ఒక్క చిన్న సంఘటన చాలు.. దీంతో ఎన్నికల నాటికి ఏం జరగబోతుందా అనే ఆసక్తి కుత్బుల్లాపూర్‌లో ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.