ఈసారి అసెంబ్లీ ఎన్నికలు MIMకు ఊహించని ఝలక్ ఇచ్చాయి. ఆ పార్టీ కంచు కోటలకు బీటలు వారుతున్న సంకేతాలు వెలువడ్డాయి. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక చోట ఓడిపోయి ఏడు సీట్లను మాత్రమే గెల్చుకుంది మజ్లిస్. పేరుకు ఏదైనా.. కొన్ని చోట్ల చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఉంది పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్‌తో ఎంఐఎం జత కట్టడం రెండు పార్టీలకీ కలిసి వస్తుందని భావించారు. కానీ ఫలితాల సరళి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందట.
TDP : డోన్ నియోజకవర్గం టీడీపీలో మారుతున్న ఈక్వేషన్స్.. కేఈ ఫ్యామిలీ రీ ఎంట్రీ.. ?
హైదరాబాద్‌లో పోటీ చేసిన ప్రతిచోటా ప్రతిసారి తిరుగులేని ఆధిపత్యం కనబరిచే MIM.. ఈసారి కౌంటింగ్‌లో తొలి నుంచి తడబడింది. నాలుగు చోట్ల మాత్రమే అధిక్యం ప్రదర్శించింది. యాకుత్ పురాలో బీజేపీ, నాంపల్లిలో కాంగ్రెస్ మజ్లిస్ పార్టీని వణికించాయి. చివరికి గెల్చుకున్నా.. యాకుత్‌పురాలో కేవలం 878 ఓట్ల మెజార్టీతో బయటపడింది ఆ పార్టీ. పాతబస్తీలో.. అదీ కూడా యాకుత్‌పురా లాంటి నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి అలాంటి మెజార్టీని అస్సలు ఊహించలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే.. కోర్ ఏరియా అయిన చార్మినార్ నియోజకవర్గంలో సైతం ఎంఐఎం, బీజేపీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్టు జరిగింది. ఈ నియోజకవర్గం పరిధిలో స్థిరపడ్డ ఉత్తరాది ఓటర్లంతా బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. బీజేపీ ఓట్లు ఏకపక్షంగా ఉండటం, ఓట్లు చీలిపోవడంతో ఇక్కడ పతంగి పార్టీకి చెమటలు పట్టాయంటున్నారు.
మొత్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో MIM మీద బీజేపీ ఎఫెక్ట్ గట్టిగానే పడిందన్నది విశ్లేషకుల మాట. మరీ ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ అంశం ముస్లిం మహిళల మీద గట్టి ప్రభావం చూపిందన్న అంచనాలున్నాయి. ఆ కారణంగా కుటుంబాల్లో ఓట్లు చీలాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అలాగే గడిచిన పదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కూడా అంటున్నారు. కానీ.. ఈసారి పరిస్థితి మారిపోయి అధికార రేస్ లోకి వచ్చేసరికి ఆ పార్టీకి ఉండే సంప్రదాయ ఓట్ బ్యాంక్ తిరిగి అటు వైపే మళ్ళినట్టు చెబుతున్నాయి లెక్కలు. దీంతో సాలిడ్‌గా ఉండే ముస్లిం ఓట్ బ్యాంక్ ఇటు కాంగ్రెస్, అటు మహిళల రూపంలో కొంతమేర బీజేపీకి మళ్ళడంతో మజ్లిస్ పార్టీ విజయం కోసం కష్టపడాల్సి వచ్చిందంటున్నారు. తమ ప్రాబల్యం ఉన్న సీట్లలో ఎప్పుడూ నల్లేరు మీద నడకలా ఉండే విజయం కోసం ఈసారి టెన్షన్ పడాల్సి రావడంతో ఒవైసీలు ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. మొత్తంగా చూసుకుంటే ముస్లిం సంప్రదాయ ఓట్ బ్యాంక్ మజ్లిస్‌కు దూరం అవుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మరి పొలిటికల్‌గా అన్నదమ్ములు ఈ ప్యాచప్ వర్క్ ని ఎలా చేస్తారో చూడాలి.