Hyderabad : హైదరాబాద్ జనం.. కాంగ్రెస్ ని ఎందుకు నమ్మలేదు?

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు చూశాక అందరికీ ఒకటే డౌట్. హైదరాబాద్‌ ఎందుకు హస్తగతం కాలేదు? ఇక్కడి అంచనాలు తల్లకిందులు అయ్యాయి ఎందుకు? సిటీలో కాంగ్రెస్‌ ఏయే వర్గాలను నమ్ముకుంది.. కానీ ఆ వర్గాల ఓట్లు ఎటు మళ్లాయి? రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపినా.. గ్రేటర్‌ పరిధిలో ఇంపాక్ట్‌ లేకపోవడానికి కారణం ఏంటనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు చూశాక అందరికీ ఒకటే డౌట్. హైదరాబాద్‌ ఎందుకు హస్తగతం కాలేదు? ఇక్కడి అంచనాలు తల్లకిందులు అయ్యాయి ఎందుకు? సిటీలో కాంగ్రెస్‌ ఏయే వర్గాలను నమ్ముకుంది.. కానీ ఆ వర్గాల ఓట్లు ఎటు మళ్లాయి? రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపినా.. గ్రేటర్‌ పరిధిలో ఇంపాక్ట్‌ లేకపోవడానికి కారణం ఏంటనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ ఆశించినట్టే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ.. అనుకున్నన్ని సీట్లు మాత్రం రాలేదన్నది ఆ పార్టీ అగ్ర నేతల అభిప్రాయం. జిల్లాల వారీగా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అన్నిచోట్ల హస్తం హవా కనిపించింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో తప్ప.. మిగిలిన చోట్ల ఆశించిన స్థాయిలోనే వర్కౌట్ చేసుకోగలిగింది కాంగ్రెస్‌. కానీ.. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రం ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయింది.

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే.. ఏపీలో ఎందుకు ఉలికిపాటు..?

మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎందుకు వెనకబడ్డామన్న చర్చ గట్టిగానే మొదలైంది పార్టీలో. గ్రేటర్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపించడానికి కారణాలపై పోస్ట్‌మార్టం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామనుకున్న ఖైరతాబాద్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, అంబర్‌పేట లాంటి నియోజకవర్గాలు చేజారడంపై పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సెటిలర్స్‌, టీడీపీ సానుభూతిపరుల ఓట్ బ్యాంక్‌ మొత్తం సాలిడ్‌గా తమకు మళ్ళుతుందని అంచనా వేసింది కాంగ్రెస్‌. కానీ.. ఫలితాలు చూస్తే.. అలాంటి ప్రభావం పెద్దగా లేదన్న నిర్ణయానికి వచ్చింది. మరీ ముఖ్యంగా పార్టీ ఆశలు పెట్టుకున్న టీడీపీ ఓటు బ్యాంక్‌ పెద్దగా కాంగ్రెస్ వైపు మళ్ళినట్టు కనిపించలేదు.

అదే సమయంలో గ్రేటర్‌ పరిధిలో సెటిలర్స్‌ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కారు పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. అటు బీజేపీని కూడా ఆదరించారు తప్ప.. ఏ దశలోనూ కాంగ్రెస్‌ వైపు వాళ్ళు మొగ్గలేదు. తమకు బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడంతో.. సెటిలర్స్‌, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తమకు పడలేదనీ.. అవి బీఆర్‌ఎస్‌కే మళ్ళాయన్న అంచనాకు వచ్చారట కాంగ్రెస్‌ పెద్దలు. అంటే.. ఆ వర్గాలన్నీ కాంగ్రెస్‌ను నమ్మలేదా? కలిసి నడవడానికి ఇష్టపడలేదా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమకు పట్టం కట్టారని, ఆశలు పెట్టుకున్న గ్రేటర్‌ పరిధిలో హ్యాండ్‌ ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్‌ పార్టీలో గట్టిగానే జరుగుతోంది. మొత్తంగా గ్రేటర్‌ వైఫల్యాలపై త్వరలోనే సమీక్ష జరిపి వ్యవహారాన్ని సెట్‌ చేయాలని పీసీసీ అనుకుంటున్నట్టు తెలిసింది.