YS SHARMILA: కొడంగల్ నుంచి షర్మిల పోటీ.. రేవంత్‌ను టార్గెట్ చేసిందా..?

షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకున్న నేతల్లో రేవంత్ ఒకరు. ఆయన షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ షర్మిల పార్టీని విలీనానికి ఒప్పుకోలేదు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 03:10 PM IST

YS SHARMILA: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలని షర్మిల భావిస్తున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలలపాటు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్ర నేతలనూ కలిశారు. తనకు పాలేరు టిక్కెట్‌తోపాటు, మరికొన్ని సీట్లు ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పారు.

కానీ, దీనికి కాంగ్రెస్ నుంచి సరైన స్పందన రాలేదు. చివరకు ఇంతకాలం వేచి చూసి, ఇక కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది వైఎస్సార్టీపీ. షర్మిల.. తాను కోరుకున్న పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయం. అయితే, రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మొదట రెండో స్థానంగా మిర్యాలగూడను ఎంచుకున్నా.. ప్రస్తుతం కొడంగల్‌పై దృష్టి సారించారు. ఇది రేవంత్ రెడ్డి పోటీ చేయబోయే నియోజకవర్గం. నిజానికి షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకున్న నేతల్లో రేవంత్ ఒకరు. ఆయన షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ షర్మిల పార్టీని విలీనానికి ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డు తగిలిన రేవంత్‌నే షర్మిల టార్గెట్ చేశారు. పాలేరుతోపాటు కొడంగల్‌లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకుంది. రేవంత్ ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదపబోతున్నారు. కొడంగల్‌లో పోటీపై షర్మిల త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. కొడంగల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇలాంటి పరిస్థితిలో షర్మిల పోటీ కచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. మరి దీనికి రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.