తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల ఉపఎన్నికల నిర్వహణపై తిరకాసు నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీలకు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ కోటాలో BRS తరపున గతంలో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపికవడంతో MLC పదవులకు రిజైన్ చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు విడి విడిగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే జరిగితే రెండు ఎమ్మెల్సీలూ అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కేలా ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి జనవరి 29న ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ రెండు ఎన్నికలను విడి విడిగా నిర్వహించాలని CEC ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది. రెండు సీట్లకు విడి విడిగా బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తారు. అందులో ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ఉంటాయి. పోలింగ్ స్టేషన్లను కూడా విడి విడిగా ఏర్పాటు చేస్తారు. ఓటర్ల జాబితా కూడా వేర్వేరే. పోలింగ్ అయ్యాక… ఓట్ల లెక్కింపు కూడా దేనికదే నిర్వహిస్తారు.
నామినేషన్లు వేయదలుచుకున్న అభ్యర్థులు తాము ఎవరు ఖాళీ చేసిన స్థానాల్లో పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రాల్లో పేర్కొనాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు.. ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం కామన్. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆయా పార్టీలు ఎమ్మెల్సీలను ఎన్నుకుంటాయి. కానీ ఇప్పుడు నిర్వహిస్తున్న విధానంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఖాళీ అయిన ఈ రెండు స్థానాల్లో.. తమ వంతు వాటాగా రావల్సిన ఒక్క స్థానం కూడా దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.
గత విధానంలో ఒకే నోటిఫికేషన్ లో MLC ఎన్నికలు నిర్వహించినట్టయితే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకి 41 సభ్యుల కంటే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి.. చెరో సీటు గెలుచుకోడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దేనికవే ఎలక్షన్స్ కాబట్టి.. ఎక్కువ సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ కే రెండు సీట్లు వస్తాయి. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి.. ఇద్దరి పదవీ కాలం 2027 నవంబర్ 30తో ముగుస్తోంది. అలాంటప్పుడు ఒకే ఎన్నిక కాకుండా.. రెండుగా నిర్వహించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారులు.. CEC ని వివరణ కోరారు.
గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాగే రెండు ఎన్నికలు నిర్వహించడం వల్ల… ఆ రెండు స్థానాలూ బీజేపీకి దక్కాయి. 2023 మే 29న జరిగిన శాసనమండలి ఎన్నికలు రెండూ వేర్వేరుగా జరిగాయి. అక్కడ ఇద్దరు సభ్యుల పదవీకాలాల ముగింపు వేర్వేరుగా ఉన్నాయి. సభ్యుడి మరణం లేదా రాజీనామా కారణంగా ఏర్పడిన ఖాళీలకు ఉప ఎన్నికలను వేర్వేరుగా జరపడం వరకూ ఒకే. కానీ తెలంగాణలో పదవీకాలం ఒకే టైమ్ లో ముగుస్తున్నా.. వేర్వేరు ఎన్నికలు జరపడం ఏంటని చర్చ నడుస్తోంది. ఒకవేళ రెండింటినీ క్లబ్ చేస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరొక ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంటాయి. లేకపోతే మాత్రం రెండూ కాంగ్రెస్ కే దక్కుతాయి.