BJP FIRST LIST : రేపే బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే…

తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ (BJP) అభ్యర్థుల జాబితా రెడీ అయింది. ఈ నెల 24న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత పేర్లను ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా... 10 సీట్లకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు.

తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ (BJP) అభ్యర్థుల జాబితా రెడీ అయింది. ఈ నెల 24న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత పేర్లను ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా… 10 సీట్లకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీయే విజయ్ సంకల్ప్(Vijay Sankalp) పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను కూడా ప్రకటించబోతోంది. రాష్ట్రంలో మల్కాజ్ గిరి ఎంపీ స్థానం హాట్ సీటుగా మారింది.

తెలంగాణలో బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటించాడానికి ఢిల్లీ నాయకత్వం సిద్ధమైంది. ఢిల్లీలో శనివారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను డిసైడ్ చేస్తారు. ఈ మీటింగ్ కు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్ హాజరవుతున్నారు. మొదటి జాబితాలో 9 లేదా 10 మంది పేర్లు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఆరు లేదా ఏడు సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు. సిటింగ్ ఎంపీలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) పేర్లు మొదటి జాబితాలో ఉంటాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరు అనౌన్స్ చేస్తారా… లేదా కొత్తవాళ్ళకి ఛాన్సిస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది.

మిగతా పార్టీల్లో లాగే బీజేపీలోనూ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం హాట్ సీటుగా ఉంది. ఇక్కడ పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొదటి స్థానంలో ఉన్నారు. చేవెళ్ళ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్టే. మహబూబ్ నగర్ కి డికే అరుణ, జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో గతంలో నిలబడిన బంగారు శృతికే మళ్ళీ టిక్కెట్ ఇచ్చే ఛాన్సుంది. భువనగిరికి బూర నర్సయ్య గౌడ్ తో పాటు వెదిరే శ్రీరాం, మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు రేసులో ఉన్నారు. MIMకి అడ్డా అయిన హైదరాబాద్ సీటు కోసం కూడా ఈసారి పోటీ ఎక్కువగానే ఉంది. కానీ అసదుద్దీన్ ఒవైసీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబట్టే ఛాన్సుంది. ఇక్కడ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. మెదక్ ఎంపీ సీటు కోసం రఘునందన్ రావుతో పాటు కొత్తవారు పోటీలో ఉన్నారు.

జహీరాబాద్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు అంతర్గత సర్వేల్లో తేలింది. అందుకే అక్కడ మంచి అభ్యర్థిని దించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో ఇప్పటికే అమిత్ షా సొంతంగా నిర్వహించిన సర్వేతో పాటు… కుల సమీకరణాలను, నియోజకవర్గ పరిస్థితులను బేరీజు వేసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు – బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలని ఢిల్లీ పెద్దలు… రాష్ట్ర బీజేపీ లీడర్లకు సూచించారు. ఈ విషయంలో వస్తున్న వార్తలను తిప్పికొట్టాలనీ… ఏ పార్టీతో పొత్తు లేదని జనంలోకి తీసుకెళ్ళాలని నేతలకు సూచించింది. తెలంగాణలో సొంతంగా ఏడెనిమిది సీట్లు వస్తాయనీ… గట్టిగా కష్టపడితే మరో రెండు సొంతం చేసుకోవచ్చని బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు సూచించింది. ఏ పార్టీతో పొత్తు లేదని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జనానికి చెబుతున్నారు.