BRS-KCR: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. బీఆర్ఎస్ నేతల్లో భయం..

ఈ ఎన్నికల్లో పోటీపై పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆసక్తి చూపడం లేదు. కారణం.. ఈ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీజేపీకే అనుకూలంగా ఉంటాయని నమ్ముతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ఇప్పటికైతే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 04:11 PM IST

BRS-KCR: లోక్‌సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని నేతలు నమ్ముతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పెద్దలు.. లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టారు. కేటీఆర్, హరీష్ రావులు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

NAYANTHARA SORRY: సారీ..! కావాలని ఆ తప్పు చేయలేదు.. సారీ చెప్పిన నయనతార..

అయితే, ఈ ఎన్నికల్లో పోటీపై పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆసక్తి చూపడం లేదు. కారణం.. ఈ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీజేపీకే అనుకూలంగా ఉంటాయని నమ్ముతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ఇప్పటికైతే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచింది. మిగతా పథకాల అమలుకోసం ప్రయత్నిస్తోంది. అయితే, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటివి ఇంకా అమలు చేయకపోయినా.. ప్రస్తుతానికి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత కనిపించడం లేదు. మరోవైపు అయోధ్యలో రామాలయం ప్రారంభంతో బీజేపీ కూడా ఊపు మీదుంది. ఈ పరిస్థితుల్లో తమకు ఎలాంటి ఫలితాలు వస్తాయో అని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో కంగారు కనిపిస్తోంది. పైగా.. అధ్యక్షుడు కేసీఆర్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బయటకు వచ్చే పరిస్థితి లేదు.

పార్లమెంట్ ఎన్నికలంటే కోట్ల రూపాయల ఖర్చు. అంత ఖర్చు చేసి గెలుస్తామనే నమ్మకం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తొమ్మిది సీట్లకు పరిమితమైంది. అలాంటిది ఇప్పుడు ఎన్నిసీట్లు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. 16 సీట్లు గెలుస్తామని కేటీఆర్ చెబుతున్నా.. ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇప్పటికిప్పుడు ఉద్యమాలు చేసి.. పార్టీకి ఊపు తెచ్చే పరిస్తితులు కనిపించడం లేదు. అందుకే లోక్‌సభ ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారు.