HMDA Siva Balakrishna : కోడ్ కి ముందు 90 ఫైల్స్ క్లియర్.. విల్లాలు, ఫ్లాట్స్ అడ్డగోలు అనుమతి

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) అవినీతి (Corruption) కేసులో తవ్విన కొద్దీ ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అనకొండ బాలకృష్ణను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాలకృష్ణ... తెల్లారి నుంచి నోరు విప్పాడు.

 

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) అవినీతి (Corruption) కేసులో తవ్విన కొద్దీ ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అనకొండ బాలకృష్ణను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాలకృష్ణ… తెల్లారి నుంచి నోరు విప్పాడు. దాంతో లెక్కలేని ఆస్తులు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఆయన ఇంట్లో ఏసీబీ దాడులు చేసినప్పుడు దొరికిన ఆస్తుల బినామా డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు ఏసీబీ (ACB) అధికారులు. బినామీలను ప్రశ్నిస్తూ అరెస్ట్ లు చేస్తున్నారు. అటు HMDA, MAUD లోని సీనియర్ అధికారులపైనా విచారణ ప్రారంభమైంది.

శివ బాలకృష్ణ ఇంట్లో దాడి చేసినప్పుడు బినామీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ (Benami Documents) భారీగా పట్టుబడ్డాయి. వాటిల్లో కొన్ని బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల పేర్లతో ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. కోర్టు నుంచి కస్టడీకి తీసుకొని బాలకృష్ణను విచారిస్తున్న ఏసీబీ అధికారులు… బినామీలను కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నారు. శివ బాలకృష్ణ సోదరుడు శివన నవీన్ దంపతులు, భరత్ పేర్లతో పాటు మరి కొందరు కుటుంబ సభ్యులు పేర్లతో భూములు, ఫ్లాట్లు ఉన్నట్టు తేలింది. ఈ డాక్యుమెంట్లపై నవీన్ సరైన సమాధానాలు చెప్పలేదు. దాంతో అతడిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. రెండు రోజుల పాటు HMDA ఆఫీసులో సోదాలు నిర్వహించిన ఏసీబీకి కీలక సమాచారం దొరికింది.

HMDAకు చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కూడా ఏసీబీ నజర్ పెట్టింది. ఇద్దరు డైరెక్టర్లతో పాటు ఒక మెంబర్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ పైనా విచారణకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఎన్నికల నోటిఫికేషన్ కు సరిగ్గా రెండు రోజుల ముందు HMDAలో కీలక ఫైల్స్ కి ఈ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బయటపడింది. కొన్ని‌ ఫైల్స్ కి ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా పబ్లికేషన్ కి సిద్దం చేశారు HMDA అధికారులు. MAUDలోని డైరక్టర్లే హడావిడిగా ఈ అనుమతులు ఇచ్చినట్టు తేలింది. ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద 90 ఫైల్స్ కి అర్జెంట్ గా పర్మిషన్స్ ఇచ్చారు. అసలు అప్లికేషన్లు పెట్టకుండా… ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక్కరోజులో అప్రూవల్స్ ఎలా ఇచ్చారు. ఎవరు చెబితే ఇచ్చారన్నది అర్థంకాని ప్రశ్న.

ఈమధ్యే వట్టి నాగులపల్లి ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. ఇదే తరహాలో HMDA భూ బదలాయింపు వ్యవహారం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో పాత డేట్స్ తో ఫైల్స్ అప్రూవల్ చేసినట్టు తేలింది. మాజీ HMDA స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నంతవరకూ పాత డేట్స్ తోనే ఆమోదించారు. మల్టీస్టోర్డ్ ప్రాజెక్టులు, విల్లా ప్రాజెక్టులకు పాత తేదీలతో బాలకృష్ణ అనుమతులు జారీ చేసినట్టు బయటపడింది. వీటిల్లో ఎన్ని కోట్లు చేతులు మారాయన్న దానిపై ACB అధికారులు విచారణ జరుపుతున్నారు.

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగుస్తోంది. అయితే ఇంకా చాలా ఆస్తుల సంగతి తేలాల్సి ఉండటంతో… కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నారు. మళ్ళీ ACB కస్టడీకి తీసుకుంటే… బాలకృష్ణకు సహకరించిన అధికారులు, ప్రభుత్వ పెద్దల సంగతి బయటపడే అవకాశాలున్నాయి.