Bandi Sanjay, Etela Rajender : ఆగని ఈటెల బండి కుమ్ములాటలు..

తెలంగాణ బీజేపీకి జోడెద్దుల్లా.. కలిసి నడవాల్సిన ఈటల రాజేందర్, బండి సంజయ్ పందెం కోళ్ళలా పోట్లాడుకుంటున్నారు. పార్టీ ఏమైపోతే మాకేంటి? మేం మాత్రం తగ్గేలేలే.. అంటున్నారు. తెలంగాణ కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది? సాక్షాత్తు అమిత్‌ షా చెప్పినా.. డోంట్‌ కేర్‌ అంటున్నారు ఈటెల, బండి సంజయ్.

తెలంగాణ బీజేపీకి జోడెద్దుల్లా.. కలిసి నడవాల్సిన ఈటల రాజేందర్, బండి సంజయ్ పందెం కోళ్ళలా పోట్లాడుకుంటున్నారు. పార్టీ ఏమైపోతే మాకేంటి? మేం మాత్రం తగ్గేలేలే.. అంటున్నారు. తెలంగాణ కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది? సాక్షాత్తు అమిత్‌ షా చెప్పినా.. డోంట్‌ కేర్‌ అంటున్నారు ఈటెల, బండి సంజయ్.

నేషన్‌ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్.. ఇదీ బీజేపీ విధానం, కార్యకర్తల నినాదం. కానీ తెలంగాణ బిజెపి నేతల్లో మాత్రం సెల్ఫ్ ఫస్ట్.. మిగతావన్నీ లాస్ట్ అన్నట్టుగా ఉందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మరీ ముఖ్యంగా.. ఈటల రాజేందర్, బండి సంజయ్‌ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతోందన్న ఆవేదన పార్టీ కేడర్‌లో పెరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నా.. అందులో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధానం అన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. నేతలు పార్టీ విస్తృత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా.. కేవలం వ్యక్తిగత ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇవ్వడంవల్లే ఎక్కువగా నష్టపోయామన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. సీట్ల కేటాయింపు నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలోనూ ఒకతాటిపైకి రాకపోవడం, తమ మాటే నడవాలని అనుకోవడం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. కీలక నేతల ఓటమికి కూడా ఒకరితో మరొకరికి పడకపోవడమే కారణమని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు.

ఇంతా జరిగినా.. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా.. ఇప్పటికీ ముఖ్యనేతల తీరు మారలేదనే చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. ఏం జరిగినా.. ఎవరెటుపోయినా.. మా రూట్ మాదే అన్నట్టు వ్యవహరిస్తున్నారట కొందరు నేతలు. ప్రధానంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఒకరంటే ఒకరికి పడక.. వివిధ అంశాల్లో బయటికి చెప్పకూడని విషయాలను సైతం పరస్పరం లీకులు ఇచ్చుకుంటున్నారని, దానివల్ల పైకి కనిపించని నష్టం జరిగిపోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో. ఇద్దరు నేతల అనుచర వర్గాలు సోషల్ మీడియా వార్‌కు తెరలేపాయి. దీంతో పార్టీ పరువు దిగజారుతోందన్న అభిప్రాయం పెరుగుతోందట. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను గెలుపు ప్రాతిపదికన కాకుండా.. తమ వారికి ఇప్పించుకుని నాశనం చేశారని రెండు వర్గాలు పరస్పరం నిందించుకుంటున్నాయట. కానీ.. అంతా అయిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం ఏంటి? ఇప్పటికీ విషయం గ్రహించకుండా నిందారోపణలు చేసుకుంటే పార్టీ పరువు పోవడం తప్ప ఉపయోగం ఏంటన్న ప్రశ్న వివిధ వర్గాల నుంచి వస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన అమిత్ షా రాష్ట్ర పర్యటనలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌లో ఈ ఇద్దరు నేతలకు గట్టిగానే తలంటినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికైనా కలిసి పని చేయండనీ.. లేకుంటే తీరు వేరుగా ఉంటుందని సూటిగానే చెప్పినట్టు తెలిసింది. అమిత్ షాతో భేటీ ముగిసిన కొద్ది సేపటికే ఈటల రాజేందర్, బండి సంజయ్ కలిసి మీడియాతో మాట్లాడతారని అధికారిక సమాచారం ఇచ్చాయి పార్టీ వర్గాలు. కానీ.. చివరికి ఈటల మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. బండి సంజయ్‌ ఎందుకు రాలేదన్న ప్రశ్న వస్తోంది. అంటే.. సాక్షాత్తు అమిత్ షా చెప్పినా.. ఆయన హైదరాబాదులో ఉండగానే.. వారిద్దరూ ఎడ మొహం పెడ మొహంగా ఉండటాన్ని బట్టి.. విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ ప్రయోజనాలకన్నా.. సొంత ఇగోలకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యనాయకులు.. దీన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తారోనన్న ఆందోళన వ్యక్తం అవుతోందట బీజేపీ కేడర్‌లో. పార్టీకి కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో అగ్ర నాయకత్వం ఈవివాదం ఎలా సెట్‌ చేస్తుందో చూడాలి.