తెలంగాణలో కమలం పార్టీ కట్టు తప్పిందా? పార్టీ సిద్ధాంతాలను డబ్బు డామినేట్ చేస్తోందా? దొరికినంత దండుకో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే బాపతు పెరిగిపోతోందా? అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా నేతలు అందినంత దోచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీలో ఇన్నేళ్ళలో లేనిది ఇప్పుడు కొత్తగా డబ్బు మూటల మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి?
తెలంగాణ కాషాయ దళంలో కొత్త రచ్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన నిలువు దోపిడీ వ్యవహారాలపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కొత్త, పాత అన్న తేడా లేకుండా.. చాలామంది నాయకులు అందినకాడికి నొక్కేశారని అధినాయకత్వం పరిశీలనలో తేలిందట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అర్థ, అంగ బలంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్.. ఖర్చుల కోసం లోకల్‌గా నిధుల్ని బాగానే సర్దిందంటున్నారు. పార్టీ బలాలు, బలహీనతల్ని బేరీజు వేసుకుని నియోజకవర్గాలను గ్రేడింగ్ చేసి.. అభ్యర్థులకు ఖర్చుల కోసం డబ్బు సర్దిందట. కానీ.. పై స్థాయిలో ఒకటి అనుకుంటే.. కింది స్థాయిలో జరిగింది మరొకటి అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎలక్షనీరింగ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు పక్కదారి పట్టినట్టు అగ్ర నాయకత్వానికి సమాచారం అందింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు.. డబ్బు ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టకుండా.. నొక్కేసిన వారిలో చాలామందే ఉన్నారని రిపోర్ట్స్ అందినట్టు ప్రచారం జరుగుతోంది.
కొందరు అభ్యర్థులు కూడా బీజేపీ హైకమాండ్ పంపిన డబ్బు విషయంలో కక్కుర్తిగా వ్యవహరించి ఎక్కువ మొత్తం దాచేసుకున్నారని అంటున్నారు. చివరికి కార్యకర్తల ఖర్చులను కూడా పట్టించుకోనివారి గురించి తెలిసి అవాక్కయ్యారట పార్టీ పెద్దలు. కంచే చేను మేసినట్టు.. నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్న కొందరు బీజేపీ సీనియర్లు కూడా అభ్యర్థులతో కుమ్మక్కయి.. నొక్కు రాజా.. నొక్కేయ్ అంటూ తలో నాలుగు కట్టలు వెనకేసుకున్నారట. వీళ్ళే కాదు.. టికెట్ ఇస్తే.. అంత ఖర్చు పెట్టుకుంటా.. ఇంత ఖర్చు చేస్తానని.. ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం ముందు గప్పాలు కొట్టిన చాలామంది.. తీరా ఎలక్షనీరింగ్ టైంలో జేబులో చెయ్యి పెట్టడానికి ఆలోచించారట. సొంత డబ్బు తీయబోమనీ.. పార్టీ ఇస్తే ఖర్చు పెడతామని చెప్పిన వాళ్ళు కూడా ఇచ్చిన మొత్తాన్ని ఖర్చు పెట్టలేదట. పోలింగ్ బూత్ ఏజెంట్‌లకు కూడా ఖర్చులకి డబ్బు ఇవ్వని నాయకుల్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారట తెలంగాణ బీజేపీ పెద్దలు. రాష్ట్రస్థాయి పార్టీ నేతలు కొందరు కూడా ఈ నొక్కుడు బ్యాచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దగా దృష్టి పెట్టని నియోజక వర్గాలకు ఏదో.. అంతో ఇంతో అమౌంట్ పంపేసి.. మిగతావి తమ జేబుల్లో వేసేసుకున్నారట ఆ లీడర్స్. మొత్తం మీద డబ్బుల వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. మరి లోక్‌సభ ఎన్నికల టైంకి డబ్బుల యవ్వారం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు.