తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు.. కుండపోత వానలు కురబోతున్నాయని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీంత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయ్. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోని అదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, జగిత్యాల, నిర్మల్, కొమురం భీం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రానున్న 4రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతారవణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చు. ఏపీలోనూ నాలుగు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం… క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపుకు చేరనుంది. దీంతో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 30, 31 తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతుతాయని.. అయితే శుక్ర, శని వారాలు మాత్రం అతి భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అలర్ట్ ఇచ్చింది. అతి భారీ వర్షాలు శుక్రవారంతో మొదలై సెప్టెంబర్ 2 వరకు కొనసాగవచ్చుని తెలిపింది.