Kattipalli Venkataramana Reddy : రోడ్డు కోసం సొంత ఇల్లు కూల్చేశారు.. కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Kattipalli Venkataramana Reddy).. ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఈ పేరు ఓ సెన్సేషన్‌. ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి.. జెయింట్ కిల్లర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసిన కాటిపల్లి.. రాజకీయనాయకుడు కాదు.. నిజమైన లీడర్ అనిపించుకుంటున్నారు.

కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Kattipalli Venkataramana Reddy).. ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఈ పేరు ఓ సెన్సేషన్‌. ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి.. జెయింట్ కిల్లర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసిన కాటిపల్లి.. రాజకీయనాయకుడు కాదు.. నిజమైన లీడర్ అనిపించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు… ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ నుంచి అడ్లూర్‌ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయ్.

ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ (Shabbir Ali) ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్‌ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్‌ (KVR) రెడీ అయ్యారు. ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు అప్పగించారు. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే కాటిపల్లి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇదే రూట్‌లో షబ్బీర్‌ అలీ ఇల్లు కూడా ఉండడంతో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే సొంత మేనిఫెస్టో, సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని.. అవినీతికి చోటు లేకుండా చూసుకుంటానని పదే పదే చెప్తున్న ఎమ్మెల్యే కాటిపల్లి చేసిన పని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో చప్పట్లు కొట్టిస్తోంది. మాటలు చెప్పే రాజకీయ నాయకులను చూశాం.. జనం కోసం మాట మీద నిలబడి త్యాగాలు చేసే లీడర్‌ను మొదటిసారి చూస్తున్నాం అంటూ.. కాటిపల్లి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.