స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే.. తాటికొండ రాజయ్య (Tati Konda Rajaiah) చుట్టూ కనిపించి వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కడియం శ్రీహరి (Kadiam Srihari) తో విభేదాలు, సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కారణం ఏదైనా బీఆర్ఎస్ నుంచి టికెట్ దూరం చేశాయ్. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించినా.. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రాకపోవడంతో.. రాజయ్య ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో గులాబీ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్‌కు రాజీనామా లేఖ కూడా పంపారు.
ఐతే కాంగ్రెస్ (Congress) లో చేరిక మాత్రం ఆయనకు అంత ఈజీగా కనిపించడం లేదు. స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ కేడర్ నుంచి కనిపిస్తున్న వ్యతిరేకతకు తోడు.. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కనీసం ఆయనను పట్టించుకోకపోవడంతో.. రాజయ్య రాజకీయ భవిష్యత్ ఏంటా అనే చర్చ మొదలైంది. చిలిపి రాజయ్య ఎటూ కాకుండా ఇరుక్కుపోయారు పాపం అంటూ.. స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన రాజయ్యకు… హస్తం నేతలు హ్యాండిస్తున్నారు. ఢిల్లీలో రాజయ్యను కలిసేందుకు.. కాంగ్రెస్ పెద్దలు మొహం చాటేస్తున్నారని తెలుస్తోంది.
10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మీడియాకు లీకులు ఇచ్చి ఢిల్లీకి వెళ్లిన రాజయ్యను.. ఢిల్లీ పెద్దలు కనీసం పట్టించుకోలేదని సమాచారం. తన బ్యాక్‌గ్రౌండ్, బలాల గురించి వివరిస్తూ 30పేజీల లేఖ రాసి మల్లిఖార్జున్ ఖర్గేకు పంపినా.. ఆయన అపాయిట్మెంట్ ఇవ్వకపోగా.. కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కూడా పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక అటు సొంత నియోజకవర్గంలోని మహిళలు పెద్దఎత్తున గాంధీ భవన్‌కు చేరుకుని… రాజయ్యను పార్టీలో చేర్చుకుంటే చెప్పులతో కొడతాం అంటూ ధర్నా చేశారు. దీంతో రేవంత్ కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. రాజయ్య చేరికకు మొదట్లో ఓకే చెప్పిన రేవంత్.. సొంత పార్టీలో వస్తున్న నిరసనలు వస్తుండడంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.