స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా చేసిన ముగ్గురు పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో ఆ పార్టీ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అప్పటి అపోజిషన్ లీడర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులు, బంధువులు, అనుచరుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టారు. అధికారపార్టీ నేతల పనులు చేసుకుంటూనే… వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి కోట్లు దండుకున్నట్టు ఈ పోలీస్ అధికారులపై ఆరోపణలున్నాయి.
BRS ప్రభుత్వ హయాంలో అప్పటి SIB చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు నలుగురు పోలీస్ అధికారులు. ఈ కేసులో మొదట ప్రణీత్ రావు పట్టుబడగా… ఆయన కస్టడీలో చెప్పిన నిజాలతో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. ఇంకా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధా కిషన్ రావు, ఐ న్యూస్ మీడియా చానెల్ ఎండీ శ్రవణ్ రావు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు… చెన్నై ద్వారా అమెరికాకు చెక్కేసినట్టు పోలీసులు గుర్తించారు. న్యూస్ ఛానెల్ ఎండీ శ్రవణ్ లండన్ లో ఉన్నట్టు తేలింది. ఈ ముగ్గురి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ని అలెర్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర్లోనే ఓ కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని ట్యాపింగ్ ఆఫీస్ ఓపెన్ చేశాడు మాజీ డీసీపీ ప్రణీత్ రావు. రేవంత్ రెడ్డితో పాటు… ఆయన సోదరులు, బంధువుల ఫోన్లను ట్యాప్ చేయడం మొదలుపెట్టారు. 2 కిలో మీటర్ల దూరం వరకూ కూడా ఫోన్లు ట్యాప్ అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. MLAల కొనుగోలు కేసులో BRS MLAల ఫోన్లను కూడా ఈ ముఠాయే ట్యాపింగ్ చేసినట్టు తేలింది. SIB టీమ్ కి ఫోన్ నంబర్లు సేకరించింది ఇచ్చింది ఐ న్యూస్ ఎండీ ( I News MD) శ్రవణ్ (Shravan) అని పోలీసుల విచారణలో తేలింది. ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ ఇంటితో పాటు న్యూస్ ఛానెల్ లోనూ పోలీసులు సెర్చ్ చేశారు. ఛానెల్ ఆఫీసులో ప్రత్యేకంగా సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి… వ్యాపారులు, రాజకీయనేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తేలింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు 14 రోజులు, ప్రణీత్ రావుని ఈనెల 28 వరకూ రిమాండ్ కు పంపింది. దాంతో కొంపల్లిలోని జడ్జి నివాసం నుంచి ఈ ముగ్గురిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. మరో ముగ్గురి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ స్పై టీమ్ కి సహకరించిన కొందరు పోలీసులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.