తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలన్నీ… భక్తితో ముడిపడే సాగుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులంతా… అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుని చుట్టే పాలిటిక్స్ చేస్తున్నారు.
అయోధ్య (Ayodhya) ప్రాణప్రతిష్ట సందర్బంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ (BJP) క్యాడర్ అంతా రెండు వారాల పాటు ప్రజల్లోనే ఉన్నారు. ఆ తంతు ముగిసిందో లేదో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల అంశంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. ప్రతీ ఏటా కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను… మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా నిర్వహించేవారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ (TTD) నుంచి అర్చకులను పిలిపించి… ఏనుగు అంబారీల ఊరేగింపుతో ఒక ఉత్సవంలా నిర్వహించేవారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో… ఆ ప్రభావం కరీంనగర్‌లో నిర్వహించే వెంకన్న బ్రహ్మోత్సవాలపై పడింది. పార్టీ అధికారం కోల్పోయినా కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రతి ఏడాది లాగే… ఈ సారి కూడా వడ్డీ కాసుల వాడి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పొన్నం రూపంలో అడ్డుకట్ట పడిందట. నగరానికే చెందిన పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) … హుస్నాబాద్‌లో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కరీంనగర్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గంగుల (Gangula Kamalkar) నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలపై ఆయన కన్ను పడిందట. ఆ ఉత్సవాలను ఈసారి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించడంతో అసలు కథ మొదలైది. ప్రభుత్వం ఉండగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయంలో ఇతరులెలా ఉత్సవాన్ని నిర్వహిస్తారంటూ…పొన్నం ఆలయ అధికారులను పిలిపించుకొని మాట్లాడారట. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఏడు రోజుల పాటు వెంకటేశ్వరస్వామి ఉత్సవాలను మంత్రి హోదాలో పొన్నం ఆధ్వర్యంలో నిర్వహించడం ఖాయమైంది. అయితే గతంలో పన్నెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను.. ఇప్పుడు కుదించడంపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు షురూ చేశాయట.
దేవుడు సెంట్రిక్‌గా మంత్రి వర్సెస్ మాజీ మంత్రిగా (Minister vs. Ex-Minister) మారిన రాజకీయాలు… కరీంనగర్‌లో కొత్తేమీకాదు. ఈ ట్రెండ్ దాదాపు 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. బండి సంజయ్ (Bandi Sanjay)… బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ ఎంపీగా ఎదగడానికి దైవానుగ్రహమే కారణమంటారు. బండి నేతృత్వంలో నిర్మించి, నిర్వహిస్తున్న మహాశక్తి ఆలయ ముగ్గురమ్మల దీవెనలే కారణమని బండి సంజయ్ బలంగా నమ్ముతారు. అంతకుముందు అలాంటి ఆలోచనలు లేని గంగుల… తానూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మొదలుపెట్టారట. మొదట గణేష్ నవరాత్రులు, దుర్గా నవరాత్రులను స్టార్ట్ చేసి.. తర్వాత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అన్నీ తానై జరిపే స్థాయికి వెళ్లారట. సంజయ్‌కి పోటీగా చేసిన ప్రయత్నం ఫలించడంతో ఓ అడుగు ముందుకు వేసారట గంగుల. గణేష్, దుర్గా నవరాత్రుల సందర్భంలోనూ విగ్రహాలను ఇప్పించడం, మంటపాలను ఏర్పాటు చేసేందుకు సాయం చేశారు.
కరీంనగర్‌లో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ హోరాహోరీగా సాగిన పోరులో… గంగుల విజయం సాధించడానికి ఆ ఉత్సవాలే కారణమంటారు. హిందూ ఓట్లు సాలీడ్‌గా బీజేపీ వైపు మళ్లకుండా… కమలాకర్‌పై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఉత్సవాలు, పూజలు కీలకంగా మారాయి. అంతకుముందు బండి వర్సెస్ గంగుల అన్నట్టుగా కనిపించిన ఆధ్యాత్మిక రాజకీయాలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుని… ట్రయాంగిల్‌గా మారాయి. ఈ గాడ్ బేస్ పాలిట్రిక్స్‌ని అన్ని పార్టీల నేతలు ప్లే చేస్తున్నారు. ఇంతకాలం దేవుడి సాయంతో భక్తులను ఆకర్షించడంలో పోటీ పడ్డ గంగుల, బండి సంజయ్‌ల బాటలోనే… మంత్రి పొన్నం వెళ్లాలనే ఆలోచన సత్ఫలితాలనిస్తుందా…? ఆధ్యాత్మిక రాజకీయాల్లో హస్తం నేత నిలబడతారా…? అన్నది ఆసక్తికరంగా మారింది.