ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎమ్మెల్సీ కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 16న ఎంక్వైరీకి రావాలని ఈడీ ఆ నోటీసుల్లో కోరింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనని కవిత రిప్లయ్ ఇచ్చారు. గతంలోనూ ఇలాగే ఢిల్లీకి పిలిపించి… గంటల పాటు విచారణ చేశారు ఈడీ అధికారులు. మహిళలను ఈడీ ఆఫీసుకు కాకుండా… ఇంట్లో లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దానిపై ఇంకా న్యాయస్థానం తీర్పు చెప్పాల్సి ఉంది. తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున… విచారణకు రానంటోంది కవిత. మరి ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది.
సౌత్ గ్రూప్ లిక్కర్ స్కాం ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను కవిత ముట్ట చెప్పిందని దర్యాప్తు సంస్థల ఆరోపిస్తున్నాయి. కవిత ఉపయోగించిన సెల్ ఫోన్ లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. అయితే
గత విచారణ సందర్భంగా తాను వాడిన ఫోన్లను ఈడీకి ఇచ్చారు కవిత. ఆ తర్వాత మరో 3 సార్లు ఎంక్వైరీకి రావాలని పిలిచారు. ఇది నాలుగోసారి… కానీ సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఎంక్వైరీకి రావడం లేదంటూ ప్రతిసారీ కవిత ఈడీకి రిప్లయి ఇస్తున్నారు.
అయితే గతానికీ… ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ముఖ్యమంత్రి కూతురుగా కవితకు ఓ ప్రియారిటీ ఉండేది. అప్పట్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉండటం వల్లే… కవితను అరెస్ట్ చేయలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల వల్లే తెలంగాణలో మంచి స్వింగ్ లో ఉన్న బీజేపీ ఎన్నికల తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో… కవితను ఎలాగైనా జైలుకు పంపాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీయే ఈ ప్లాన్ వేసిందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్టను, ప్రజా నమ్మకాన్ని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కల్లా కాపాడుకునే ప్రయత్నమే అని విమర్శించారు.
తనను ఇంటి దగ్గర లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణ కూడా దీని మీదే జరుగుతోంది. మరి ఈడీ అధికారులు… ఇంటి దగ్గర విచారణ చేస్తారా… లేదంటే అరెస్ట్ చేస్తారా.. అన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు వచ్చిన ఈడీ నోటీసులు ఆ పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి.