KAVITHA FEAR : ఓటమి భయంతో తప్పుకున్న కవిత.. అభ్యర్థుల కోసం KCR తంటాలు..

లోక్ సభ అభ్యర్థుల్ని విడతలవారీగా ఖరారు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ముఖ్యనేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. బుధవారం మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు.

తెలంగాణలో నలుగురు లోక్ సభ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ (BRS) ప్రకటించింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ (Kasani Gnaneshwar), వరంగల్‌ నుంచి కడియం కావ్య, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్థన్‌ను కేసీఆర్ ఎంపిక చేశారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ మొత్తం తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇంకా 8 ఎంపీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

లోక్ సభ అభ్యర్థుల్ని విడతలవారీగా ఖరారు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ముఖ్యనేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. బుధవారం మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ – డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ – అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్‌, చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీలు ఉన్న… ఇతరులకు అవకాశం కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు టిక్కెట్ ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోసారి పోటీకి ఆయన సిద్ధమైనా… టిక్కెట్ ఇవ్వలేదు. తనకు అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానన్నారు దయాకర్. ఇక్కడ నుంచి సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..తాజా ప్రకటనతో మొత్తం 9 మందిని నిలబెట్టింది.

ఇప్పటికే మొదటి జాబితాలో బీఆర్‌ఎస్‌ ఐదుగురు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మహబూబ్ నగర్ లో మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేసింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అయితే నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై గతంలో కవిత పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అరవింద్ ని ఓడిస్తానని శపథాలు చేసిన కవిత… ఈసారి ఓటమి భయంతో జారుకున్నారు. 2018లో ఉమ్మడి నిజాబాద్ జిల్లాలో 8 స్థానాల్లో BRS గెలిచింది. అయినా 2019లో అరవింద్ చేతిలో కవిత ఓడిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీకి ఎంపిక చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. అసలే BRSకు వ్యతిరేక పరిస్థితి ఉంది. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది. ఈ టైమ్ లో కవిత పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయం. మూడో స్థానానికి దిగజారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే పోటీకి భయపడి ఈసారి నిజామాబాద్ నుంచి బాజిరెడ్డిని నిలబెట్టినట్టు తెలుస్తోంది. అసలే BRS కి గడ్డుకాలం నడుస్తున్న టైమ్ లో KCR కుటుంబ సభ్యులు ఎందుకు పోటీ చేయట్లేదని గులాబీ కార్యకర్తలు మండిపడుతున్నారు.