తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) బీఆర్ఎస్ (BRS) ఓటమి తర్వాత.. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్. జాతీయ రాజకీయాల్లో (National Politics) చక్రం తిప్పుతానంటున్న గులాబీ అధినేత.. లోక్‌సభ బరిలో (Lok Sabha Elections) ఉండబోతున్నారా.. మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారా.. కేటీఆర్ (KTR) కూడా అదే దారిలో నడవబోతున్నారా.. నిజంగా అదే నిజం అయితే.. రాష్ట్రంలో కారు పార్టీ బాగోగులు చూసుకునేవారు ఎవరు.. ఇదీ ఇప్పుడు గులాబీ పార్టీ చుట్టూ వినిపిస్తున్న చర్చ. ఇదంతా ఎలా ఉన్నా.. చెప్పిందే చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఏదైతే చెప్పారో.. సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్‌మీట్‌లో పదేపదే ఏ మాటలు అయితే అన్నారో.. ఇప్పుడు దాన్నే అనుసరించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.
అదే వ్యవసాయం చేయడం. ఫామ్‌హౌస్‌లో తన భూమిలో వ్యవసాయం చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. తాను ఓడిపోయిన పెద్ద నష్టం లేదని.. తెలంగాణ తెచ్చిన పేరే తనకు కొండంత ఉందని.. ఎవరో మంచో ఎవరు చెడో గుర్తించి ఓటు వేయాలని.. ఒకవేళ తాను ఓడిపోయినా.. వెళ్లి ఎర్రవల్లిలో వ్యవసాయం చేసుకుంటానని.. ప్రచారం సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పారు. ఐతే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడుతూ.. జనాలు తీర్పు ఇచ్చారు. దీంతో ఇప్పుడు కేరాఫ్ ఎర్రవల్లి అయ్యేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధథం అవుతున్నారు. వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి.. ఫామ్ హౌస్‌కి విత్తనాలు, ఎరువులు పంపించాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
పదిరోజుల్లో ఫామ్‌హౌస్‌కు వస్తానని.. వ్యవసాయం చూసుకుంటాన్న కేసీఆర్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8న ఎర్రవల్లిలో కాలు జారి పడిపోయిన కేసీఆర్.. తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తుంటికి ఆపరేషన్ కూడా అయింది. ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. కేసీఆర్ ఆరోగ్యం గురించి.. ఆ ఎరువుల షాప్ యజమాని ఆరా తీశారట. ఐతే తాను ఆరోగ్యంగా ఉన్నానని.. పూర్తిగా కోలుకున్నాక వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటానని.. ఆలోపు పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల పంపించాలని కేసీఆర్ కోరారు. ఇప్పుడీ న్యూస్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది.