KCR ON KAVITHA : కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం.. అరెస్ట్ అయి నెల… ఎందుకు మాట్లాడలేదు

BRS MLC కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఏప్రిల్ 15కి నెల రోజులైంది. మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపి, ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవితను తీసుకెళ్ళేటప్పుడు... తల్లి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు... ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు.

BRS MLC కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఏప్రిల్ 15కి నెల రోజులైంది. మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపి, ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవితను తీసుకెళ్ళేటప్పుడు… తల్లి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు… ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఈడీ కస్టడీ, సీబీఐ కస్టడీలో ఉన్నప్పుడు తల్లి శోభ, భర్త అనిల్ తో పాటు, కేటీఆర్, హరీష్ రావు కూడా కవితను కలిసి మాట్లాడారు. కానీ బాపూ… అంటే కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ మాట్లాడలేదు… చూడటానికి వెళ్ళలేదు… కనీసం కవిత ఏ తప్పూ చేయలేదని ఒక్క ప్రకటనా చేయలేదు.

కవిత అరెస్టయి నెల రోజులైనా కేసీఆర్ ఒక్క ముక్కా ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ప్రచార సభల్లో అయినా కేసీఆర్ నోరు విప్పుతారని అనుకున్నారు. కానీ ఎంతకీ కాంగ్రెస్ కు ఓట్లేసి జనం తప్పు చేశారని ఆడిపోసుకుంటున్నారే గానీ…కవిత ఏం చేసింది… ఎందుకు అరెస్ట్ చేశారు… అసలు లిక్కర్ స్కామ్ తో ఆమెకు ప్రమేయం ఉందా లేదా… బీజేపీ ప్రభుత్వం కావాలని ఆమెను అరెస్ట్ చేయించిందా… ఇలా ఏ ప్రకటనా చేయట్లేదు.

లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయట్లేదని నిలదీస్తున్నారు. చేవెళ్ళ సభలో బీజేపీని కూడా వదల్లేదు. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. కానీ ఏ సందర్భంలోనూ కవిత అరెస్ట్, ఈడీ, సీబీఐ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నాయన్న ప్రకటన చేయలేదు కేసీఆర్. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కవిత నిజంగానే అవినీతికి పాల్పడ్డారా… లిక్కర్ స్కాముల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయా… అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే కవిత గురించి మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ లోక్ సభ ఎన్నికలపై పడుతుందని అనుకోవడం వల్లే కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

సాధారణంగా కేసీఆర్ పదేళ్ళ పాలనలో కూడా జనం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న ఏ ఇష్యూపైనా మాట్లాడ లేదు కేసీఆర్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులపైనా అందుకే స్పందించడం లేదని అంటున్నారు.