తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తరువాత ఏళ్ల తరబడి అధికారానికి దూరంగా ఉన్న చాలా మందికి వరుసగా పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే బల్మూరి వెంకట్(Balmuri Venkat), మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కు ఎమ్మెల్సీలు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, ప్రణాళికసంఘ ఉపాధ్యక్ష పదవులకు ఇద్దరు వ్యక్తులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవికి మండవ వెంకటేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసినట్టు సమాచారం. వెంకటేశ్వర్ రావు సంగతి పక్కన పెడితే.. వేం నరేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డికి దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీ (TDP)లో పని చేసినప్పటి నుంచే వీళ్లిద్దరూ మంచి మిత్రులు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చాలా సార్లు మీడియా ముందు చెప్పారు.
నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరూ ఉభయ సభల్లో తమ మార్క్ క్రియేట్ చేశారు. వేం నరేందర్‌ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.. రేవంత్‌కు వేం నరేందర్ రెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పడానికి. ఓటుకు నోటు కేసు తరువాత రేవంత్ రెడ్డి ఎదుర్కున్న ప్రతీ సమస్యలో నరేందర్ రెడ్డి రేవంత్ వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచీ రేవంత్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేంనరేందరే పర్యవేక్షించే వారు. అంతటి స్నేహం ఉన్నా.. నరేందర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేకపోయారు రేవంత్ రెడ్డి. దీంతో తన ప్రభుత్వంలో స్నేహితునికి కీలక పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేలా ఈ ఇద్దరికి ఏరి కోరి ఈ పదవులకు ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వీరి నియామకానికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.