నాగార్జున కబ్జా చేసిన స్థలం ఇదే! N-కన్వెన్షన్‌ నుంచి ఎంత సంపాదించారంటే

  • Written By:
  • Publish Date - August 24, 2024 / 06:00 PM IST

హైదరాబాద్‌లో ఏ పెద్దింట్లో పెళ్లి జరిగినా అది N-కన్వెన్షన్‌లో జరగాల్సిందే. ఏ సెలబ్రిటీ ఫంక్షన్‌ జరిగినా దాని కేరాఫ్‌ అడ్రస్‌ N-కన్వెన్షన్‌ ఉండాల్సిందే. దాదాపు పదేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఓ వెలుడు వెలిగిన N-కన్వెన్షన్‌ను గంటల వ్యవధిలో నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. తుమ్మటికుంట చెరువును ఆక్రమించి ఈ ఫంక్షన్‌ హాల్‌ కట్టారని కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో N-కన్వెన్షన్‌ను డిమాలిష్‌ చేశారు. రియల్టర్లలో వణుకు పుట్టిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు మొదలయ్యింది కాదు. దాదాపు 9 ఏళ్లుగా సాగుతున్న వ్యవహారం ఇది. 2015లో హైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌కు అవతల.. హీరో నాగార్జున ఈ N-కన్వెన్షన్‌ నిర్మించుకున్నారు. 10 ఎకరాల్లో ఉన్న ఈ ఫంక్షన్‌ హాల్‌లో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారు అనేది ముందు నుంచీ ఉన్న ఆరోపణ. ఇందులో ఒక ఎకరా 12 సెంట్లు FTL. మరో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌. రేవంత్‌ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అసెంబ్లీలో ఈ N-కన్వెన్షన్‌ గురించి ఆరోపణలు చేశారు. కానీ.. అధికారులు నోటీసులు ఇవ్వడం.. వాటితో పాటే కోర్టు స్టే ఇవ్వడం.. ఇదే వ్యవహారం పదేళ్లుగా N-కన్వెన్షన్‌ విషయంలో జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగిన తరువాత ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. N కన్వెన్షన్.. తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే కట్టారు.. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వాటిని పూర్తిగా నేల మట్టం చేశారు హైడ్రా అధికారులు. దీంతో ఇప్పుడు N కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలు మాత్రమే. పెద్ద పెద్ద సెట్టింగులు వేసేందుకు, విలాసవంతంగా ఫంక్షన్‌లు చేసేందుకు చాలా లగ్జరీయస్‌గా N-కన్వెన్షన్‌ను రూపొందించారు. గత పదేళ్లలో దీని పేరు మీద నాగార్జున వందల కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నాగార్జునకు ఉన్న మొత్తం ఆస్తుల్లో ఈ N-కన్వెన్షన్‌ కేవలం 10 శాతం మాత్రమే. కానీ భూమి కబ్జా చేసి నిర్మించారు అన్న ఆరోపణలతో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. దీని కూల్చివేతపై నాగార్జున కూడా స్పందించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్న సమయంలో హైడ్రా ఇలా కూల్చేయడం కరెక్ట్‌ కాదని.. ఈ విషయం కోర్టులోనే తేల్చుకుంటామంటూ నాగార్జున సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పదేళ్లుగా కోర్టు ఈ విషయంలో స్టే ఇస్తూనే ఉంది.. కానీ ఇప్పుడు ఏకంగా అధికారులు నిర్మాణాలను కూల్చేశారు. మరి ఇప్పుడు కోర్టు నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో చూడాలి.