BRS LEADERS : బీఆర్ఎస్ ని మడత పెట్టే పనిలో రేవంత్.. లోక్ సభ ఎన్నికల తర్వాతే అసలు కథ

తెలంగాణ(Telangana)లో బయటపడుతున్న అధికారుల అవినీతి విచారణలు ఎవరిని ఉద్దేశించి మొదలుపెట్టినవి... కోట్లకు పడగలెత్తిన అవినీతి తిమింగలం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna)... తర్వాత మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ (Somesh Kumar) పాతిక ఎకరాల భూమి కొనుగోలు... వీళ్ళు BRS పెద్దల బినామీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తించారా ? అందుకే కింద నుంచి నరుక్కొస్తున్నారా ?

 

 

తెలంగాణ(Telangana)లో బయటపడుతున్న అధికారుల అవినీతి విచారణలు ఎవరిని ఉద్దేశించి మొదలుపెట్టినవి… కోట్లకు పడగలెత్తిన అవినీతి తిమింగలం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna)… తర్వాత మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ (Somesh Kumar) పాతిక ఎకరాల భూమి కొనుగోలు… వీళ్ళు BRS పెద్దల బినామీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తించారా ? అందుకే కింద నుంచి నరుక్కొస్తున్నారా ? హైదరాబాద్ చుట్టూ భూముల పందేరంలో వందలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి… చాలా మంది బినామీల పేరుతో రెవెన్యూ రికార్డులకు ఎక్కినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. వీటిని నిగ్గు తేలిస్తే… మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పాత్ర బయటకు వస్తుందా ? ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కనిపించిన రేవంత్ రెడ్డి వేరు… ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి వేరు. అప్పట్లో దూకుడు ఇప్పుడు కనిపించట్లేదు. అప్పటి పరిస్థితులు చూస్తే… రేవంత్ కసితో ఏదైనా చేస్తాడు… బీఆర్ఎస్ పెద్దలను మడత పెట్టేస్తాడు అనుకున్నారు జనం. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక రేవంత్ రెడ్డి చాలా హుందాగా కనిపిస్తున్నారు… అప్పుడప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై బరస్ట్ అవుతున్నారు. పాలనపైనే దృష్టిపెట్టారు… ఇది బయటకు కనిపిస్తున్న దృశ్యం కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా టాక్టిక్ గా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. తన ఆవేశాన్ని మాటలతో కాదు… మెల్ల మెల్లగా చేతల్లో చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే…. విద్యుత్ ఒప్పందాలు, మేడిగడ్డపై విచారణకు ఆదేశించడం ద్వారా కాస్త దూకుడుగా వ్యవహరించారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు కూడా రెడీ అవుతోంది. అందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ పాలనలో అవినీతి అధికారులు, ప్రభుత్వ పెద్దల బండారం ఒక్కోటి బయటకు వస్తోంది.

HMDAలో డైరక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ (ACB) దాడులు జరగడం… వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన…. హైదరాబాద్ శివారుల్లో వందల ఎకరాల భూములు బినామీ పేర్లతో కొనడం… రాష్ట్రంలో సంచలనంగా మారాయి. బాలకృష్ణ అవినీతిని వెతుకుతుంటే… మాజీ సీఎస్ సోమేశ్ కుమార్… పాతిక ఎకరాల భూమి కూడా బయటపడింది. ఫార్మాసిటీకి దగ్గరల్లో తన భార్య పేరున 25 ఎకరాల ల్యాండ్ ను ఎకరం రెండున్నర లక్షలకే కొనడం అనేది… ఏదో తేడా కొట్టింది. ఆయన స్థలం పక్కనే సోమేశ్ సన్నిహితుడి పేరుతో 125 ఎకరాలు బయటపడింది. దీంతో పాటు మరో మాజీ IPS అధికారి ఏకంగా రైతులను బెదిరించి 300 ఎకరాల భూములు కొన్నట్టు తేలింది. సోమేశ్ కుమార్… మాజీ సీఎం కు సన్నిహితుడు… సోమేశ్ రెరాలో పనిచేసినప్పుడే… శివ బాలకృష్ణ కూడా ఆ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. అంటే… సోమేశ్… బాలకృష్ణ లింకులు… కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు చేరతాయా ?

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనపై కేసులు పెట్టించారు.. ఇంట్లో కూతురు పెళ్ళి జరుగుతున్నప్పుడే జైలుకు పంపారు… BRS హయాంలో రేవంత్ రెడ్డిపై ఎన్ని రాజకీయ కక్షసాధింపులు జరగాలో అన్నీ జరిగాయి… ఏదైనా మన మంచికే అన్నట్టు… ఇప్పుడు రేవంత్ కి అవకాశం కలిసివచ్చింది. అందుకే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టిపెడితే… ప్రతి కేసూ కేసీఆర్, కేటీఆర్ దగ్గరకే వెళ్తాయని తెలుస్తోంది.

కేసీఆర్ (KCR) అధికారంలో పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన భూదందాలపై ఎన్నో ఆరోపణలున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డే … లెక్కలు, ఆధారాలతో సహా అప్పట్లో బయటపెట్టారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. ఎన్నికల షెడ్యూల విడుదల అయ్యాక కూడా అక్రమంగా రాత్రికి రాత్రే చాలా ప్రభుత్వ భూములను ధరణి అడ్డుపెట్టుకొని రెగ్యులర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా రేవంత్, ఇతర కాంగ్రెస్ (Congress) నేతలు ఎన్నికల కమిషనర్ కి కూడా కంప్లయింట్ చేశారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక… భూదందాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరిని టార్గెట్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయో బాగా గ్రహించారు కాబట్టే… అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాక… భూదందాలు ఒక్కోటి బయటపడుతున్నాయి.

ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు, ఇతర లీడర్లు… భూములను తమ ఇష్టానికి సొంతంగా రాసేసుకున్నట్టు కాంగ్రెస్ అప్పట్లో ఆరోపణలు చేసింది. కేసీఆర్ కు అంత్యంత సన్నిహితుడు, ధరణి సృష్టికర్త సోమేశ్ కుమార్ కూడా అందుకు తీసిపోలేదని అంటుంటారు. ఇప్పుడు యాచారంలో బయటపడ్డ పాతిక ఎకరాలు కూడా అలా సంపాదించిందేనా… లేదంటే సోమేశ్ చెబుతున్నట్టుగా ప్రశాసన్ నగర్ లో ఇల్లు అమ్మికొన్నారా… అన్నది ప్రభుత్వం జరిపించే ACB ఎంక్వైరీలో తేలనుంది. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూమి ఎకరా విలువ 3 కోట్లుగా ఉంది. అంటే పాతిక ఎకరాలు 75 కోట్ల రూపాయలు. కానీ ఎకరం రెండున్నర లక్షలకు సోమేశ్ ఎలా కొన్నారు. అతనికి ఖాతా నంబర్ 5237 అనేది ఎలా వచ్చింది. ఈ భూములను సేల్ డీడ్ తో కాకుండా సాదా బైనామాతో కొనడం ఏంటి ? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ఎందుకు కనిపించట్లేదు. ఇంత ఖరీదైన భూమిని కొని DOPT కి ఎందుకు సమాచారం ఇవ్వలేదు. ఇవన్నీ రేపు ఏసీబీ ఎంక్వైరీలో బయటకు వస్తాయి.

శివ బాలకృష్ణ, సోమేశ్ కుమార్ నిజంగా భూములు కొన్నారా… గులాబీ పెద్దలకు బినామీలుగా ఉన్నారా అన్నదానిపై నిగ్గు తేలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి… వీళ్ళిద్దరి సంఘటనలు బయటకు రాకముందు… HMDA నిధులు కోట్ల రూపాయలను ప్రభుత్వ అనుమతి లేకుండా ఫార్ములా రేస్ నిర్వాహకులకు అప్పగించిన అర్వింద్ కుమార్ కేసు కూడా బయటపడింది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెబితేనే ఇచ్చానని ఆ అధికారి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అక్కడ కేటీఆర్ ఇరుక్కుపోయారు. ఇంకా ఇలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారో… వాళ్ళందరినీ బయటకు లాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని నేరుగా ఆరోపణలు చేయకుండా… డైరెక్ట్ గా వాళ్లపై కేసులు పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళని నేరుగా టార్గెట్ చేస్తే… కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న టాక్ వస్తుంది. సానుభూతి పెరుగుతుంది.

ఏపీలో చంద్రబాబు(Chandrababu)పై సీఎం జగన్ ఇలాగే వ్యవహరించారన్న ఆరోపణులున్నాయి. దాంతో బాబుకు ఏపీలో సింపతీ పెరిగింది. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా… కింద నుంచి నరక్కుంటూ వస్తున్నారు రేవంత్. ఏసీబీ ద్వారా ఈ అవినీతిని మూలాల నుంచి తవ్వుకుంటూ వస్తే… అప్పుడు ఆటోమేటిగ్గా అవి కేసీఆర్, కేటీఆర్ (KTR)దగ్గరకు వచ్చి చేరతాయి. అప్పుడు జనం కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కక్ష సాధింపులు చేయట్లేదు.. అవినీతి అనకొండ అధికారులను పట్టుకుంటే… అసలైన వాళ్ళు బయటకు వచ్చారని నమ్ముతారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి గుట్టు అంతా బయటకు వస్తుందనీ… ఎన్నికలు ముగిశాకే రేవంత్ అసలు పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారన్న టాక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ పరమపద సోపాను పటంలో… ప్రభుత్వ పెద్దల అవినీతికి సహకరించిన అధికారులు కూడా బలి అవ్వక తప్పదనిపిస్తోంది.