REVANTH REDDY: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం సంక్రాంతికి ముందు గానీ, తర్వాత గానీ ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఆయనతో కలిపి ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురిని చేర్చుకోడానికి అవకాశం ఉండగా.. కాంగ్రెస్ ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే ఇందులో రెండు, మూడు కేబినెట్ పదవులను ప్రతిపక్షంలోని రెండు పార్టీల సీనియర్ లీడర్ల కోసం ఖాళీగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు 2, 3 పదవులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భర్తీ చేసినా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు BRS, BJP లీడర్ల కోసం మరోసారి విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు.
T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్‌కి బొటాబొటీ మెజారిటీయే ఉంది. ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే మెజారిటీకి నలుగురు మాత్రమే ఎక్కువ. అయితే రాబోయే రోజుల్లో.. కేసీఆర్ లాగే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన 15 నుంచి 16 మంది దాకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో కాంగ్రెస్ బలం 80కి చేరుకుంటుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చేరికలు ఉంటాయి. దాంతో 2 లేదా 3 కేబినెట్ పదవులు.. పార్టీలో చేరే ఆ పెద్ద లీడర్ల కోసం ఖాళీగా ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి.. సంక్రాంతికి మినీ కేబినెట్ విస్తరణ మాత్రమే చేపట్టే ఛాన్సుంది. అంటే 3 లేదా 4 మంత్రి పదవులను మాత్రమే నింపుతారు. ఇందులో ఒకటి గ్రేటర్ హైదరాబాద్‌కి, మరొకటి మైనార్టీ లీడర్‌కి ఇస్తారని అంటున్నారు. సంక్రాంతికి మినీ కేబినెట్ విస్తరణ అయిపోతే.. లోక్‌సభ ఎన్నికల ముందు BRS, BJP నుంచి వచ్చే పెద్ద నాయకులతో మరోసారి విస్తరణ చేపడతారని చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన దీపా దాస్ మున్షీ.. లోక్‌సభ ఎన్నికలపై గాంధీభవన్‌లో ఈనెల 3న ఓ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపికైనవారితో పాటు ఓడిన వారు, టిక్కెట్లు నిరాకరించడంతో ఖాళీగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. వీళ్ళల్లో కొందరు లోక్‌సభ టిక్కెట్లు కూడా ఆశిస్తున్నారు. మంత్రి పదవులు, లోక్‌సభ సీట్ల కోసం పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండటంతో.. వీళ్ళల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది..? ఎవరిని కార్పోరేషన్ పదవులతో బుజ్జగించే అవకాశం ఉంది..? అన్నది ఈ వారంలో తేలనుంది. మరి కాంగ్రెస్ ఆశిస్తున్నట్టుగా BJP, BRS నుంచి ఆ 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారా లేదా అన్నది సంక్రాంతి తర్వాత తేలనుంది.