తెలంగాణలో గులాబీ, కమలం కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలసి పోటీ చేస్తే..ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఆ దిశగా చర్చలు ప్రారంభం కావొచ్చు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) తో కయ్యం పెట్టుకోవడం కన్నా… ఏదో ఒక పార్టీతో నెయ్యమే మంచిదని బీఆర్‌ఎస్ పెద్దలు డిసైడ్ అయ్యారు తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.
అవును… వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. చేయి చేయి కలిపి నడవడానికి సిద్ధమవుతున్నారట. బీజేపీ, బీఆర్ఎస్ విషయమై ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ (Telangana Political) సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట ఇది. రెండు పార్టీల దోస్తీకి బలమైన సంకేతాలు వెలువడుతున్నాయంటున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పైకి కొట్టిపారేస్తున్నారు. కానీ… కొంత మంది బీఆర్‌ఎస్ అగ్రనేతలు మాత్రం BJPతో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ అభిప్రాయం సేకరణ చేస్తున్నట్టు తెలిసింది. కమలంతో కలిసి నడిచేందుకు బీఆర్‌ఎస్ తహతహలాడుతున్న సిగ్నల్స్ బలంగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్లీ మేమే పవర్‌లోకి వస్తామని ధీమాగా ఉన్నారు కమలనాథులు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలనుకున్న కేసీఆర్ (KCR) కలలకు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాజ్ వచ్చింది. ప్రస్తుతానికి ఆయన జాతీయ రాజకీయాలను పక్కన బెట్టి రాష్ట్రంలో పవర్ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారన్నది పరిశీలకుల మాట. ఈ టైంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో, అటు కేంద్రంలో బీజేపితో కయ్యం పెట్టుకోవడం సరికాదని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో… కాషాయ దళంతో దోస్తీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్కోర్ కావాలంటే పొత్తు సరైన నిర్ణయమని బీఆర్‌ఎస్ సీనియర్లు కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అంతా సిద్ధమనీ… ప్రకటనే లాంఛనమేనన్నది బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు మాజీ మంత్రుల మాట.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఎవరికి ఓటేసినా ఇద్దరికీ వేసినట్టేనని గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రచారం హైదరాబాద్ మినహా… మిగతా అన్ని ఏరియాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లను బీఆర్‌ఎస్‌కు దూరం చేసిందన్నది ఓ విశ్లేషణ. దీంతో ఇప్పటికే ఆ రెండూ ఒకటేనన్న ముద్ర ఎలాగూ ఉంది కాబట్టి… కొత్తగా అయ్యేది ఏమిలేదని అంటున్నారట బీఆర్‌ఎస్ నేతలు. దీనికితోడు ఎలాంటి అధికార పదవులు లేకుండా ఐదేళ్లు ఉండడం బీఆర్‌ఎస్‌కు కష్టమైన పనేనని అంటున్నారు. పొత్తు పెట్టుకుని గులాబీ బాస్ ఏదో ఒక లోక్‌సభకు సీటుకు పోటీచేసి… ఎన్డీయేలో చేరితే…. కేంద్ర కేబినెట్ లోనూ ఛాన్స్ ఉంటుందని, అందుకే దోస్తానా అనివార్యమని అంటున్నారు గులాబీ నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయడం పార్టీకి అంత మంచిది కాదని, లీడర్స్, కేడర్‌లో ఉత్సాహం లేదని, ఇలాంటి టైమ్‌లో బీజేపీతో కలిసి పోటీ చేయడమే మంచిదని బాహాటంగానే చెబుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయాక కారు పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు చాలామంది. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడాలంటే కాషాయం కలర్ వేసుకోవడమే మంచిదన్నది సార్ ఆలోచనగా కనిపిస్తోంది… అని కొందరు బీఆర్‌ఎస్ సీనియర్స్ అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉంటామన్నది కేసీఆర్ ఆలోచన. 39 ఎమ్మెల్యే సీట్లున్న బీఆర్‌ఎస్‌కు ఎంఎఐం మిత్రపక్షంగా ఉంది. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే… రెండు పార్టీలను కలుపుకుంటే బలం 46కు పెరుగుతుంది. ఇక బీజేపీతో జట్టు కడితే… ఇంకో 8 సీట్లు కలిసి ఒకే జట్టుగా ఉండే మొత్తం ప్రతిపక్షం బలం 54 మందికి చేరుతుంది.
తెలంగాణలో పవర్‌కు మ్యాజిక్ ఫిగర్ 60. అంటే… మూడు ప్రతిపక్ష పార్టీలు కలిస్తే… మ్యాజిక్ ఫిగర్‌కు ఇక కేవలం ఆరు స్థానాలే తక్కువవుతాయి. పరిస్థితులు, పరిణామాలు కలిసివస్తే ముందు ముందు కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేయడం పెద్ద కష్టమైన పనేం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే బీజేపీతో దోస్తానా అన్ని విధాలా మంచిదని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.