BRS ఎన్నికల బాండ్ల (Election Bonds) వెనక ఉన్న క్విడ్ ప్రో కో ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ప్రభుత్వం నుంచి ఇలా కాంట్రాక్ట్ తీసుకోవడం… అలా ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చుకోవడం అన్నీ ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీకి పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినా… BRS చీఫ్ కేసీఆర్ కిక్కురుమనలేదు. ఎందుకంటే దక్షిణాదిలో అత్యధికంగా ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు ముట్టింది బీఆర్ఎస్ పార్టీకే.
ఇచ్చుకో…పుచ్చుకో సంస్కృతికి BRS కి బాగా అలవాటైనట్టు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాలు చూస్తే అర్థమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుని 30యేళ్ళ పాటు లీజుకు తీసుకున్న ఇన్ ఫ్రా సంస్థ… BRS సర్కార్ కి 25 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించుకుంది. కేరళలో అధికారులు వేధిస్తున్నారంటూ 3 వేల 500 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టింది చిల్డ్రన్ వేర్ తయారీ సంస్థ కైటెక్స్. ఆ సంస్థ కూడా BRS ఖాతాలో పాతిక కోట్లు వేసింది. ఇక మెఘా ఇంజినీరింగ్ సంస్థ గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఈ సంస్థ కారు పార్టీకి 195 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చింది.
ORRలో 30యేళ్ళ లీజుకు సంబంధించి IRB ఇన్ ఫ్రాకు గత ఏడాది ఏప్రిల్ 27న LOA రిలీజ్ అయింది. ఆ తర్వాత జులై 4నాడు ఆ కంపెనీ పాతిక కోట్ల రూపాయలను BRSకు ఎన్నికల బాండ్ల రూపంలో జమచేసింది. కైటెక్స్ కంపెనీ అయితే వరంగల్ లో తమ ఫ్యాకర్టీ నిర్మాణం ముగిసేలోపు… రంగారెడ్డి జిల్లాలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం మొదలయ్యే లోపు తమ పాతిక కోట్ల దక్షిణను BRS కు సమర్పించుకుంది. BRS ఫ్రభుత్వం నుంచి లీజుకు తీసుకోవడం… లేదంటే అనుమతులు తెచ్చుకోవడం… గులాబీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు సమర్పించుకోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి.