BRS Party : ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్‌కు అభ్యర్థుల కరవు..

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ కోసం బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కరవయ్యారు. అన్ని సీట్లలో పోటీకి అనువైన క్యాండిడేట్స్‌ దొరకడం లేదు. మధ్యే మార్గంగా అధిష్టానం మనసులో వేరే ఆలోచన ఉన్నట్లుంది. ఆ ప్లాన్‌ పక్కాగా అమలైతే... పార్టీలోకి కొత్త తరం నేతలు రావడంతోపాటు బలోపేతం అవొచ్చనే ఆశ కనిపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ కోసం బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కరవయ్యారు. అన్ని సీట్లలో పోటీకి అనువైన క్యాండిడేట్స్‌ దొరకడం లేదు. మధ్యే మార్గంగా అధిష్టానం మనసులో వేరే ఆలోచన ఉన్నట్లుంది. ఆ ప్లాన్‌ పక్కాగా అమలైతే… పార్టీలోకి కొత్త తరం నేతలు రావడంతోపాటు బలోపేతం అవొచ్చనే ఆశ కనిపిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల వేదికగా గులాబీ పెద్దలు చేయాలనుకుంటున్న ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఆ పరాజయం నుంచి కోలుకుని లోక్‌సభలో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ (BRS) పెద్దలు అనుకుంటున్నా… గ్రౌండ్‌ లెవల్‌లో వాస్తవాలు వేరుగా ఉన్నాయట. చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి పార్టీ నేతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుందని… ఇప్పుడు ఇది ఎక్స్‌ట్రా ఖర్చు అన్న భావనతో ఎక్కువ మంది నేతలు ముందుకు రావడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే అదే సమయంలో ఈ పరిస్థితి క్యాష్‌ చేసుకోవాలన్న ప్రయత్నాల్లో మరో వర్గం నేతలు ఉన్నట్టు తెలిసింది.

చాలా రోజుల నుంచి తమ వారసుల పొలిటికల్‌ ఎంట్రీ కోసం ఆశ పడుతున్న నాయకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి బీఆర్ఎస్‌ వర్గాలు. ఆయా నియోజకవర్గాల్లో వారసుల పేర్లు పరిశీలించాలని… ఓ అవకాశం ఇవ్వాలని కొందరు ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌లో ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్షలు ముగిశాయి. ఆ టైంలోనే అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తుందని భావించినా… సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు పావులు కదిపితే… వారసుల అరంగేట్రానికి లైన్‌ క్లియర్‌ అవుతుందని కొందరు సీనియర్స్‌ భావిస్తున్నట్టు తెలిసింది. మల్కాజ్‌గిరి నుంచి తన కుమారుడు భద్రా రెడ్డిని బరిలోకి దింపాలన్న ప్లాన్‌లో ఉన్నారట మాజీ మంత్రి మల్లా రెడ్డి. ఆ విషయంలో ఇప్పటికే ఆయన కొంతవరకు సక్సెస్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయవర్గాల్లో. భద్రారెడ్డికి మల్కాజ్‌గిరి దాదాపుగా క్లియరైనట్టే అన్నది మల్లారెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం.

సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తన కుమారుడు సాయి కుమార్ యాదవ్‌ (Sai Kumar Yadav) ను మరోసారి పోటీకి దింపాలని అనుకుంటున్నారట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రయత్నం అయితే చేశారు కానీ.. ఈ విషయంలో పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా చూస్తున్నారట ఆయన. ఇక మరో నేత కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు వరంగల్ నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. ఆ దిశగా కడియం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలిసింది. డాక్టర్‌గా పాపులారిటీ ఉన్న కావ్య అయితే… గెలుపు తేలిక అవుతుందని అధిష్టానానికి నచ్చజెప్పే పనిలో ఉన్నారట కడియం. ఇక మహబూబాబాద్ నుంచి రెడ్యా నాయక్ కుమారుడు రవిచంద్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ తన కుమార్తె మాలోవత్ కవితను తప్పించాల్సి వస్తే… కుమారుడికి అవకాశం ఇవ్వాలని రెడ్యా నాయక్ కోరుతున్నట్టు తెలిసింది.

ఇటు సిట్టింగ్ ఎంపీ రాములు తన కొడుకును నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డిని నల్గొండ లోక్‌సభ బరిలో దింపాలని అనుకుంటున్నారట. రాజకీయంగా తనకు ఉన్న బలంతో పార్టీ టికెట్ ఇస్తే అమిత్ రెడ్డిని గెలిపించుకుని వస్తానంటూ ఆయన బీఆర్‌ఎస్‌ పెద్దలకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా బీఆర్‌ఎస్‌లో ఇప్పుడో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోందంటున్నాయి రాజకీయవర్గాలు. ఒకప్పుడు ఆ పార్టీ టిక్కెట్‌ కోసం నేతలు పోటా పోటీగా దరఖాస్తులు పెట్టుకుంటే… ఇప్పుడు దీటైన అభ్యర్థుల కోసం వెదుక్కోవాల్సి వస్తోందంటున్నారు. అయితే… ఆ లోటు వారసులతో భర్తీ అవుతుందా? పార్టీ అధిష్టానం అందరికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా అన్నది చూడాలి.