ఐఏఎస్ (IAS) అధికారి స్మితా సబర్వాల్ (Skitha Sabharwal) .. లేటెస్ట్ గా ఫేస్ బుక్ లో పెట్టిన ఓ రీల్ వైరల్ అవుతోంది. కొండపోచమ్మ సాగర్ దగ్గర ఆమె తీసుకున్న రీల్ సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ సాగర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ అనవసరంగా ఆరోపణలు చేస్తోందా.. అదే ఉద్దేశ్యం తెలిపేందుకు ఈ రీల్ పెట్టిందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ (KCR) సీఎంగా ఉన్నప్పుడు.. స్మితా సబర్వాల్ సీఎం సెక్రటరీగా (CM Secretary) ఓ వెలుగు వెలిగారు. మిషన్ భగీరథ ఇంఛార్జ్ గా కొనసాగారు. దేశంలోనే నిత్యం హెలికాప్టర్ లో ప్రయాణించిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. సీఎం కార్యదర్శి హోదాలోనే స్మితా సబర్వాల్.. అనేక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పరిశీలనకు వెళ్ళేవారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను కూడా ఆమె సందర్శించారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ (Telangana Govt) వచ్చాక.. ఓడలు బళ్ళు అయినట్టు.. కేసీఆర్ హయాంలో సీఎం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్.. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ హోదాలో పనిచేస్తున్నారు. రేవంత్ సీఎం అయ్యాక కూడా ఓ IAS అధికారిగా వచ్చి స్మిత ఆయన్ని కలవలేదు. కొన్ని రోజుల తర్వాత సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రమే సెక్రటరియేట్ కు వచ్చారు. అప్పడు మంత్రి సీతక్కతో మాట్లాడుతూ.. స్మిత సబర్బాల్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోడాన్ని గిరిజనం సంఘాల నేతలు తప్పుబట్టారు. స్మిత తన ఆటిట్యూడ్ ను ప్రదర్శించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్మిత పనిచేసినప్పుడు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఆమెను పక్కనబెట్టి.. ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు.
కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేయడంతోనే స్మితా సబర్వాల్ మళ్ళీ రీల్స్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో పనిచేసినప్పుడు ఆమె ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసేలా రీల్స్ చేసేవారు. కొత్త సెక్రటరియేట్, అంబేద్కర్ స్టాట్యూ, అమరవీరుల జ్యోతి, కొత్త ప్రాజెక్టుల దగ్గర స్మిత సబర్వాల్ రీల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల వీడియోలు, ఇమేజెస్ కూడా ప్రమోట్ చేసేవారు. కీలకపదవిలో ఉన్న IAS అధికారి రీల్స్ చేయడమేంటని గతంలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అండ ఉండటంతో ఆమెను ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉండేది.
రీసెంట్ గా స్మితా సబర్వాల్ కొండపోచమ్మ సాగర్ (Konda Pochamma Project) ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అంతా కనిపించేలా రీల్స్ చేశారు. ఆమె కూర్చోవడం.. నడుస్తూ వెళ్ళడం.. లాంటి దృశ్యాలు ఈ రీల్ లో ఉన్నాయి. సహజంగానే నేచురల్ లవర్ అయిన స్మిత.. తనకు అలవాటైన ఇలాంటి రీల్స్ తీయడంలో తప్పేమీ లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రేవంత్ రెడ్డి సర్కార్ గరమ్ గరమ్ గా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత.. గత ప్రభుత్వ పథకాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ.. శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు, మేడి గడ్డ కుంగిపోవడం.. లాంటి అనేక లోపాలను మంత్రులు బయటపెడుతున్నారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ టైమ్ లో కొండపోచమ్మ సాగర్ ను స్మిత సబర్వాల్ సందర్శించి.. దాన్ని ప్రమోట్ చేసేలా రీల్స్ చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. కేసీఆర్ ప్రాజెక్టులు ఎంత బాగున్నాయో.. అపర భగీరధుడు (Mission Bhagiratha) కేసీఆర్ అని అర్థం వచ్చేలా ఆమె రీల్స్ చేస్తున్నారా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే అంటున్నారు కొందరు. ఫేస్ బుక్ లో స్మితా సబర్వాల్ పెట్టిన రీల్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.