కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా? ఆమె ఇక్కడి నుంచి బరిలో దిగడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ విషయంలో పీసీసీ పెద్దల వ్యూహాలు రకరకాలుగా ఉన్నాయి. సోనియా పేరుతో ఆశావహుల పోటీకి చెక్ పెడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం (Khammam) హాట్ సీట్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఇటువైపు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం ఇక్కడి నుంచే మొదలైందా అన్న చర్చ పార్టీలో గట్టిగా జరుగుతుండటంతోంది. ఆ క్రమంలోనే అధిష్టానం పెద్దల్నే ఇక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే లోకల్‌గా ఉన్న వర్గపోరు, ఆశావహుల పోటా పోటీ ప్రయత్నాలకు కూడా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సోనియా గాంధీని ఖమ్మం బరిలో దింపే ప్లాన్ రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోనియా దగ్గరికి వెళ్లి ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు.
గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాహుల్ గాంధీని (Rahul Gandhi) కలిసినప్పుడు కూడా ఖమ్మం నుంచి గాంధీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరారట. మరో సీనియర్ లీడర్ రేణుకా చౌదరి కూడా ఇదే విషయం చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో రాహుల్ గాంధీ మొదటి ఎన్నికల శంఖారావం పూరించారు. నాటి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు సృష్టించినా…రాహుల్ సభ సక్సెస్ అవడమే… అప్పుడు పార్టీకి మంచి ఊపు తెచ్చిందని కాంగ్రెస్ (Congress) వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి నుంచి ఈ లోక్‌సభ సీటులో సోనియా, రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు పోటీచేయాలని అడుగుతున్నారు రాష్ట్ర నాయకులు. ఇక సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే… తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకు వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టవద్దని ప్రతిపక్షాలకు గతంలోనే విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. అదలా ఉంచితే…
తాజా పరిణామాలు మాత్రం సోనియా గాంధీ ఖమ్మం లోక్‌సభ సీట్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటివరకు పద్దెనిమిది సార్లు ఖమ్మం పార్లమెంటు సీటుకు ఎన్నికలు జరిగితే 16సార్లు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నేతలే ఎన్నికయ్యారు. ఒక్క పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తమ్మినేని వీరభద్రం మినహాయిస్తే… మిగతా వాళ్ళంతా బయటి నేతలే. పైగా వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే. ఇప్పుడు సోనియాగాంధీ పోటీ ఖాయమని పార్టీలోనే గట్టిగా ప్రచారం జరుగుతుండటంతో… ఇన్నాళ్ళు టిక్కెట్ మాదంటే మాదేనన్న ఆశావహులు సైలెంట్ అవక తప్పదంటున్నారు. ఈ ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండున్నర లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకోగలిగితే చాలు… గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం బలంగా ఉంది పార్టీ నేతల్లో.
దీంతో.. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని(Nandini), మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ్ముడు ప్రసాద రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, పీసీసీ లీడర్ కుసుమ కుమార్, పారిశ్రామికవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్‌తోపాటు చాలామంది నేతలు ఈ టిక్కెట్ ఆశించారు. అయితే ఇప్పుడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పోటీ చేయించాలని నిర్ణయించడంతోపాటు సిఎం, డిప్యూటీ సిఎం, జిల్లాకు చెందిన మంత్రి నేరుగా ఆమెను కలిసి పోటీకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ దాదాపు ఖాయమైనట్టేనంటున్నారు. అదే జరిగితే ఆశావహులంతా హ్యాపీగా ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఫైనల్‌గా నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.