Telangana Cabinet Decisions: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లకు TS బదులు ఇకపై TG గా చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర గేయంగా ఆమోదించింది. తెలంగాణలో రాజరికపు పోకడల నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ లో అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత పదేళ్ళల్లో జనం కోరుకున్న తెలంగాణ కాకుండా… దొరల పాలనగా కొనసాగిందని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం TG పేరుతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెబితే… కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రూల్స్ కి విరుద్ధంగా తమకు ఇష్టమొచ్చినట్టుగా TS ను పెట్టారన్నారు. అలాగే తెలంగాణ తల్లిని ఓ వ్యక్తి బొమ్మలాగా తీర్చిదిద్దారనీ… అందులో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రులు. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకోవాల్సిన అవసరం లేదనీ… ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందిస్తామని పొంగులేలి తెలిపారు.
తెలంగాణలో కులగణనను చేపడుతున్నట్టు ప్రకటించారు. కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు ప్రకటించారు. ఈనెల 8నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మరో రెండు పథకాలను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రక్రియ కొనసాగుతోందనీ… వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రూప్ 1 మిగతా ఉద్యోగాలకు సంబంధించి TSPSC లో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఖాళీలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామనీ… ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని చెప్పారు. త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామనీ… దానికి సంబంధించి కసరత్తు జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.